తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెంకయ్యతో స్పీకర్ ఓం బిర్లా​ భేటీ.. బడ్జెట్​ సమావేశాలపై చర్చ

Budget Session 2022: పార్లమెంట్ బడ్జెట్​​ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్​ ఎం వెంకయ్య నాయుడుతో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా భేటీ అయ్యారు. బడ్జెట్​ సమావేశాల కోసం జరిగిన సన్నాహాలు, కొవిడ్​ నిబంధనలపై చర్చించారు.

budget session 2022
budget session 2022

By

Published : Jan 30, 2022, 11:01 PM IST

Budget Session 2022: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న వేళ రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడుతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భేటీ అయ్యారు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో సోమవారం నుంచి జరగనున్న బడ్జెట్​ సమావేశాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో ఉభయ సభల సెక్రటేరియట్ సీనియర్ అధికారుల పాల్గొన్నారు.

సభల్లో గందరగోళం, రద్దీని నివారించడానికి ఉభయ సభల సభ్యులను వేర్వేరు సభల్లో కూర్చోబెట్టాలని లోక్‌సభ స్పీకర్ సూచించిగా.. వెంకయ్య నాయుడు స్వాగతించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీల బలాబలాల ఆధారంగా ఉభయ సభల ఛాంబర్లు, గ్యాలరీల్లో సీట్లు కేటాయించారు. తదనుగుణంగా తమతమ సీట్లలో కూర్చొనేందుకు ఆయా పార్టీల సభ్యుల పేర్లతో జాబితా రూపొందించేలా.. ఉభయ సభల ప్రధాన కార్యదర్శులకు సూచించినట్లు సమాచారం. రాజకీయ పార్టీల నుంచి మెరుగైన సహకారం, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.

పార్లమెంటు ప్రాంగణంలో శానిటైజేషన్‌తో సహా సాధ్యమయ్యే అన్ని కొవిడ్ ప్రోటోకాల్స్​ను పాటించేలా ఉభయ సభల ప్రధాన కార్యదర్శలు తెలియజేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సెషన్ ప్రారంభానికి 48 గంటల ముందు ఎంపీలందరూ ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థించినట్లు పేర్కొన్నాయి.

దేశంలో కరోనా మూడో దశ కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాల్లో మార్పులు జరిగాయి. పెద్దల సభ ఉదయం, సాయంత్రం లోక్​సభ నిర్వహించనున్నారు. రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయి. లోకసభ కార్యకలాపాలు సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:రెండు స్థానాల్లో సీఎం చన్నీ పోటీ.. కెప్టెన్​పై పోటీకి మాజీ మేయర్​

ABOUT THE AUTHOR

...view details