ఆదాయపన్ను మినహాయింపులపై ఈసారీ తప్పని నిరాశ
ఎన్నికల సమయంలో ఆదాయపన్ను మినహాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు ఈసారి బడ్జెట్‌లో నిరాశే ఎదురైంది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు, శ్లాబుల విషయంలో బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి మార్పు చేయలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలిగించే ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి. కేంద్ర ఉద్యోగులతో సమానంగా ఎన్‌పీఎస్ మినహాయింపునిచ్చారు. వారికి ఎన్‌పీఎస్ మినహాయింపును 10 నుంచి 14 శాతం పెంచుకునే అవకాశం కల్పించారు.
అమృతకాలానికి పునాది..
వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్ పునాదిగా అభివర్ణించారు నిర్మలా సీతారామన్. పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాందిగా పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను.. కళ్లకు కట్టేలా వివరిస్తూ పద్దును సమర్పించారు నిర్మలా సీతారామన్. పీఎం గతిశక్తి మాస్టర్‌ప్లాన్.. దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేస్తుందని వెల్లడించారు.
2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుండగా 2047 వరకు ఈ 25 ఏళ్ల కాలాన్ని ఆమె అమృత కాలంగా అభివర్ణించారు. ఈ కాలంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలను ఆవిష్కరించారు.
ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అనే నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు పార్లమెంటుకు తెలిపారు.
నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించిన నిర్మల.. పట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని వెల్లడించారు.
దేశీయ క్రిప్టో కరెన్సీ..
డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్‌బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు. ''యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తాం'' అని మంత్రి చెప్పారు.
బూస్టర్ డోస్
నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని భాజపా కితాబిచ్చింది. అన్ని వర్గాలకు మేలు చేస్తూ, ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోసులా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
వేతనజీవులకు నమ్మకద్రోహం..
వేతనజీవులకు బడ్జెట్ రూపంలో కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించింది కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపశమన చర్యలు ప్రకటించలేదని విమర్శించింది.