BJP on Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించనదని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా భారత్‌ను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం 100 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకునే నాటికి నవ భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ పునాది అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు అమిత్ షా.
"మహమ్మారి సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈసారి బడ్జెట్‌ను రూ.39.45 లక్షల కోట్లకు పెంచడమే అందుకు ఉదాహరణ. ద్రవ్యలోటును 6.9 నుంచి 6.4 శాతానికి తగ్గించడం ప్రభుత్వానికి పెద్ద విజయం. మోదీ నాయకత్వంలో త్వరలోనే ఈ ద్రవ్యలోటు 4 శాతానికి దిగువకు చేరుతుందని నాకు నమ్మకం ఉంది. వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, ఆత్మనిర్భర్‌గా తయారుచేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం ఈ బడ్జెట్లో ప్రతిబింబిస్తుంది. జీరో బడ్జెట్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, ఫార్మర్ డ్రోన్స్, నదుల అనుసంధానం వంటి అంశాలే అందుకు ఉదాహరణ."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ఈ బడ్జెట్‌పై ఇతర కేంద్ర మంత్రులు సహా భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు.
"ఇది చాలా మంచి బడ్జెట్. సమాజంలోని అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తీర్చిదిద్దారు. పేదలు, గ్రామీణ, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారికి సహా ఈశాన్య రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంది."
-కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి
"ఈ బడ్జెట్ ఆత్మనిర్భర్ భారత్ సాధించేందుకు మరిన్ని అవకాశాలను కల్పిస్తోంది. మహమ్మారి వేళ కూడా ఈ బడ్జెట్‌తో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఊతం అందినట్లైంది."
-ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి
"ఇది సామాన్యడి బడ్జెట్. మౌలిక వసతుల కేటాయింపులో 35 శాతం పెంచారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది. ఇది దేశంలో తయారీ రంగానికి బూస్టర్ షాట్."
-రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, భాజపా ఎంపీ
"ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్. ఈ బడ్జెట్ భారత్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. భారీగా కేటాయింపులు చేయడం ఈ బడ్జెట్ ప్రత్యేకత. పర్యావరణహిత, డిజిటల్ భారత్ లక్ష్యంగా దీనిని తయారు చేశారు."
-అమితాబ్ కాంత్, నీతీ ఆయోగ్ సీఈఓ
ఇది జీరో బడ్జెట్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో ఎలాంటి ఉపయోగం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్‌ను 'జీరో సమ్ బడ్జెట్'గా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
"ఇది జీరో సమ్ బడ్జెట్. ఇందులో వేతన జీవులు, పేదలు, మధ్యతరగతి వారికి ఏమీ లేదు. యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకు సంబంధించి కూడా కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
"ఈ బడ్జెట్ కేవలం ధనికులకే. పేదలకు దీనితో ఏం సంబంధం లేదు. ఇది అర్జున-ద్రోణాచార్య బడ్జెట్, ఏకలవ్యుడిది కాదు. ఇందులో క్రిప్టోకరెన్సీ గురించి కూడా ప్రస్తావించారు. అసలు వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చట్టం లేదు. దాని గురించి ఇంతకుముందు చర్చించనూ లేదు. ఈ బడ్జెట్‌ను కేవలం వారి స్నేహితులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు."
-మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత
"ఈ బడ్జెట్ పూర్తి నిరాశ కలిగించింది. ఇందులో ఏమీ లేదు. ఎంజీఎన్ఆర్ఈజీఏ, రక్షణ సహా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ బడ్జెట్‌తో అచ్చేదిన్ అనే ఎండమావిని మరింత దూరం జరిపినట్లు అయింది. ఇప్పుడు ఆ అచ్చేదిన్ కోసం మరో పాతికేళ్లు వేచిచూడాలి."
-శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ
"మహమ్మారి వేళ దేశంలో వేతన జీవులు, మధ్యతరగతికి చెందిన వారు కేంద్రం ఊరట కల్పిస్తుందని ఆశించారు. కానీ ప్రధాని, ఆర్థిక మంత్రి మరోసారి వారిని నిరాశపరిచారు. ఈ బడ్జెట్‌తో వారికి కేంద్రం నమ్మకద్రోహం చేసింది. క్రిప్టో బిల్లు ప్రవేశపెట్టకుండానే పన్ను ఎలా విధిస్తారు. అసలు క్రిప్టో కరెన్సీ చట్టబద్ధమేనా? ప్రజలకు స్పష్టతను ఇవ్వండి."