తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బోడో' ఎన్నికల ఫలితాల్లో హంగ్- పుంజుకున్న భాజపా!

బోడోల్యాండ్​ ప్రాదేశిక మండలి ఎన్నికల ఫలితాల్లో అనూహ్య తీర్పు ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవటం వల్ల హంగ్​కు దారి తీసింది. అధికార బోడో పీపుల్స్​ ఫ్రంట్​ 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. ఈసారి సొంతంగా బరిలో నిలిచిన భాజపా గణనీయంగా పుంజుకుని 9 స్థానాలు దక్కించుకుంది. దీంతో కొత్త కూటమిపై ఊహాగానాల మొదలయ్యాయి.

BTC election results
బోడోల్యాండ్​ ప్రాదేశిక మండలి ఎన్నికలు

By

Published : Dec 13, 2020, 12:43 PM IST

ఈశాన్య రాష్ట్రం అసోంలోని స్వయంప్రతిపత్తి ప్రాంతం బోడోల్యాండ్​ ప్రాదేశిక మండలి (బీటీసీ) ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. 40 మంది సభ్యుల మండలిలో అధికార బోడో పీపుల్స్​ ఫ్రంట్​ (బీపీఎఫ్​) 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మెజారిటీ ఫిగర్​ను అందుకోలేకపోయింది. యునైటెడ్​ పీపుల్స్​ లిబరేషన్​ (యూపీపీఎల్​)కు 12 సీట్లు రాగా.. భాజపా 9 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్​, గాన సురక్ష పార్టీ( జీఎస్​పీ) తలో సీటుతో సరిపెట్టుకున్నాయి.

పుంజుకున్న భాజపా..

రాష్ట్ర ప్రభుత్వంలో బీపీఎఫ్​, భాజపా కూటమిగా ఉండగా.. ఈసారి బీటీసీ ఎన్నికల్లో వేరు వేరుగా పోటీలో నిలిచాయి. ప్రచారంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు కేవలం ఒకే సీటు రాగా.. ఇప్పుడు 9 సీట్లు దక్కాయి.

కొత్త కూటమిపై..

ప్రస్తుతం హంగ్​ ఏర్పడిన క్రమంలో కొత్త భాగస్వామ్యాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. భాజపా, యూపీపీఎల్ పొత్తుపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఎన్నికల్లో హంగ్​ ఏర్పడితే కూటమిగా ఏర్పడేందుకు సానుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చాయి. ఎన్నికల ఫలితాలపై.. యూపీపీఎల్​ అధినేత ప్రమోద్​ బ్రహ్మతో భాజపా మంత్రి హిమాంత బిశ్వ శర్మ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్​ కుమార్​ దాస్​, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ దిలీప్​ సై​కియా శనివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ ఇరుపార్టీల భాగస్వామ్యంపై ఆదివారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్​తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు భాజపా నేత శర్మ.

శాంతి ఒప్పందం తర్వాత తొలి ఎన్నికలు..

స్వరాష్ట్ర కాంక్షతో ఇంతకాలం సాయుధ పోరుకు సారథ్యం వహించిన నేషనల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోల్యాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ) పరిధిలోని నాలుగు వర్గాలతో ఈ ఏడాది జనవరి 27న కొత్త ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత బీటీసీకి తొలి ఎన్నికలు కావటం వల్ల ప్రాధాన్యం ఏర్పడింది. బోడోల్యాండ్​ ప్రాదేశిక ప్రాంతం (బీటీఆర్​) పరిధిలోకి వచ్చే కోక్రాఝర్​, చిరాంగ్​, బక్సా, ఉదల్గురి జిల్లాల్లో డిసెంబర్ 7, 10వ తేదీల్లో ఎన్నికలు జరిగాయి.

వచ్చే ఏడాది ఏప్రిల్​లో అసోం శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బీటీసీ ఎన్నికలను సెమీఫైనల్​గా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు.

ఇదీ చూడండి:'బోడో' ఒప్పందంతో చిరశాంతి రహిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details