తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంగా తప్పుకున్నా యడ్డీ చుట్టూనే రాజకీయాలు

మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మేల్యేలు సాధారణంగా సీఎం చుట్టూ తిరుగుతారు. కానీ కర్ణాటకలో మాత్రం మాజీ సీఎం యడియూరప్పను సంప్రదిస్తున్నారు భాజపా శాసనసభ్యులు. సీఎం బసవారాజ్ బొమ్మై నేతృత్వంలోని కొత్త కేబినెట్​లో బెర్తు ఖరారు చేయించాలని యడ్డీ ఇంట్లో మంతనాలు జరుపుతున్నారు. సీఎంగా తప్పుకున్నా యడ్డీ ఇంకా కన్నడ రాజకీయాల్లో ఎంత కీలకంగా ఉన్నారో దీన్ని చూస్తే అర్థమవుతోంది.

BSY's house become a focal point of political activity
యడియూరప్ప, కర్ణాటక సీఎం యడియూరప్ప

By

Published : Jul 30, 2021, 11:31 AM IST

Updated : Jul 30, 2021, 2:23 PM IST

కర్ణాటకకు నూతన ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ మాజీ సీఎం యడియూరప్ప ఇంకా కీలక నేతగానే ఉన్నారు. త్వరలో కొత్త మంత్రివర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో భాజపా ఎమ్మేల్యేలంతా నూతన సీఎం బసవరాజ్ బొమ్మైని ఆశ్రయించకుండా యడ్డీ ఇంటికి వెళ్తున్నారు. కేబినెట్​లో బెర్తు కోసం ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో కన్నడ రాజకీయాల్లో ఆయన ఇప్పటికీ కింగ్ మేకర్​గా ఉన్నారని స్పష్టమవుతోంది.

యడియూరప్పను కలిసిన ఎమ్మెల్యేల జాబితాలో రేణుకాచార్య, ఎం విరూపాక్ష, బసవారజ దడెసగురు, అరగ జ్ఞానేంద్ర, కుమార్ బంగారప్ప, మునిరత్న ఉన్నారు. దాదాపు భాజపా ఎమ్మెల్యేలందరూ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో మంత్రి పదవి పొందని వారు ఈసారి ఎలాగైనా తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారు కూడా తమను కొనసాగించాలని పడ్డుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఆ ఎమ్మెల్యేల ఒత్తిడి..

జేడీఎస్​, కాంగ్రెస్ నుంచి వలస వచ్చి భాజపాలో చేరిన ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం యడియూరప్పపై ఒత్తిడి పెంచుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. "మిమ్మల్ని నమ్ముకునే మేము భాజపాలో చేరాం. మీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాం. నూతన సీఎం బొమ్మై కేబినెట్​లో మాకు చోటు కల్పించాలి. పార్టీ హైకమాండ్​తో ఈ విషయంపై చర్చించండి" అని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు యడియూరప్పను కోరుతున్నట్లు సమాచారం.

శిష్యుడే...

భాజపా అధిష్ఠానం ఎంపిక చేసిన కర్ణాటక నూతన సీఎం బసవరాజ్ బొమ్మై.. యడియూరప్ప శిశ్యుడే కావడం గమనార్హం. యడ్డీ సిఫారసు మేరకు ఆయనకు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. ఈ విషయం తెలిసే ఎమ్మెల్యేలంతా మంత్రి పదవి కోసం బొమ్మైని, పార్టీ హైకమాండ్​ను ఆశ్రయించకుండా.. యడ్డీ చుట్టూ తిరుగుతున్నారు.

కేబినెట్ ఏర్పాటు నేపథ్యంలో బసవరాజ్.. భాజపా అధిష్ఠానాన్ని కలిసేందుకు శుక్రవారం దిల్లీ వెళ్లారు. గురువారం ఉత్తర కన్నడ జిల్లా పర్యటనకు వెళ్లడానికి ముందు యడియూరప్ప నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీ సీనియర్లతో ఏం మాట్లాడాలనే విషయాలపై చర్చించారు.

అయితే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో యడియూరప్ప జాబితా సిద్దం చేసి బొమ్మైకి ఇచ్చారని, దీన్నే ఆయన దిల్లీలో పార్టీ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం పీఠం వదిలినప్పటికీ యడియూరప్ప నివాసం కన్నడ రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంటోందని పేర్కొన్నాయి.

సీనియర్ల భిన్న స్పందన

కర్ణాటక సీఎంను మార్చిన కారణంగా నూతన కేబినెట్​లో తాను చేరబోనని భాజపా సీనియర్ నేత​ జగదీశ్ షెట్టర్ ప్రకటించగా.. తాను మాత్రం మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధమని కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. మద్దతుదారులు తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అయితే పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు.

జోక్యం చేసుకోనని యడ్డీ ప్రకటన

యడియూరప్ప మాత్రం కేబినెట్​లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేసుకోవాలనే పూర్తి స్వేచ్ఛ బసవరాజ్​ బొమ్మైకి ఉన్నట్లు తెలిపారు. అధిష్ఠానంతో చర్చించి ఆయనే నిర్ణయం తీసుకుంటారన్నారు. తాను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను మళ్లీ గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:గవర్నర్​ పదవికి యడ్డీ నో- కొత్త పార్టీ పెడతారా?

కన్నడ పీఠంపై బొమ్మై.. ముగిసిన యడ్డీ రాజకీయ ప్రస్థానం!

Last Updated : Jul 30, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details