ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమలదళంలో మాస్ లీడర్ల కొరత - కర్ణాటక రాజకీయాలు

భాజపాను మొదటి నుంచీ.. ప్రాంతీయ నాయకుల కొరత వేదిస్తోంది. తాజాగా కర్ణాటకలో భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప నిష్క్రమణతో.. లోటు మరింత పెరిగింది. ఒక్క కర్ణాటకలోనే కాదు మిగతా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ నేతలు లేక కమలదళం ఇబ్బంది పడుతోంది.

BJP
కమలదళం
author img

By

Published : Jul 27, 2021, 9:23 AM IST

దక్షిణ భారతదేశంలో భాజపాకు ఇన్నాళ్లూ ఇరుసులా నిలిచిన యడియూరప్ప ఎట్టకేలకు అస్త్రసన్యాసం చేశారు! రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన చెబుతున్నా.. వయోభారం దృష్ట్యా మునుపటిలా క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు దాదాపుగా లేవు! కాబట్టి కర్ణాటకలో జనాకర్షక నేత సేవలను కమలదళం కోల్పోయినట్లే. ఒక్క కర్ణాటకలోనే కాదు.. రాజస్థాన్‌, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ వంటి పలు ఇతర రాష్ట్రాల్లోనూ భాజపాది ఇదే పరిస్థితి. మాస్‌ లీడర్లు, ప్రాంతీయ నేతలు లేక పార్టీ ఇబ్బంది పడుతోంది.

వారికి మంచి గుర్తింపు..

భాజపాలో కల్యాణ్‌ సింగ్‌, భైరాన్‌సింగ్‌ షెకావత్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, వసుంధరా రాజె, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌, భగత్​సింగ్ కోశ్యారీ, బాబూలాల్ మరాండీ, అర్జున్​ ముండా వంటి వారు ప్రాంతీయ నేతలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారంతా మాస్​ లీడర్లు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పార్టీని అధికారంలో నిలబెట్టారు. భాజపా అగ్ర నేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌.కె. అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి వంటి నేతలు జాతీయ స్థాయిలో ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఇబ్బంది పడుతున్నవేళ కూడా.. ప్రాంతీయ నేతల్లో కొందరు తమ తమ రాష్ట్రాల్లో పార్టీకి మంచి విజయాలు సాధించి పెట్టారు. ముఖ్యమంత్రులుగానూ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మాత్రం భాజపాలో అలాంటి నేతల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

యడ్డీ నాయకత్వంలోనే..

కర్ణాటకలో 1983 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు వచ్చినవి రెండంటే రెండే సీట్లు. అలాంటి స్థితి నుంచి యడియూరప్ప నాయకత్వంలో కమలదళం బాగా ఎదిగింది. ఏకంగా నాలుగుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు కూడా అధికారంలో ఉంది. రాష్ట్రంలో భాజపా బలోపేతం వెనుక యడ్డీ కృషి ఎంతో ఉంది. మధ్యలో సొంత పార్టీని ఏర్పాటుచేసుకున్నప్పటికీ తిరిగి కమలం గూటికి ఆయన చేరారు. అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. కర్ణాటకలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పార్టీకి ఇరుసులా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన సేవలను కోల్పోతుండటం కమలనాథులకు పెద్ద లోటే!

సమర్థ నాయకులు లేక.

మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఝార్ఖండ్​, ఛత్తీస్‌గఢ్‌ వంటి కీలక రాష్ట్రాలను ఇటీవల భాజపా చేజార్చుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఓటములకు అనేక కారణాలున్నా.. ప్రధానంగా కనిపిస్తున్నవి మాత్రం రెండే. ఒకటి- జనాదరణ అధికంగా ఉన్న నేత లేకపోవడం. రెండు- ప్రభుత్వంపై వ్యతిరేకత. వసుంధరా రాజె, రమణ్‌సింగ్‌ నిస్సందేహంగా మాస్‌ లీడర్లు. వారు సొంతంగా తమతమ రాష్ట్రాల్లో పార్టీకి గతంలో విజయాలు కట్టబెట్టారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే వీరిద్దరు మళ్లీ అధికారంలోకి రాలేకపోయారు. రఘుబర్‌దాస్‌(ఝార్ఖండ్), మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), దేవేంద్ర ఫడణవీస్‌ (మహారాష్ట్ర) వంటి నేతల పరిస్థితి వేరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తిరుగులేని విజయం సాధించాక.. ఝార్ఖండ్, హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకున్న జనాకర్షణ ఆయా రాష్ట్రాల్లో కమలదళం గెలుపునకు దోహదపడింది. ఆ తర్వాత మోదీ-అమిత్‌ షా ద్వయం రఘుబర్‌దాస్‌, ఖట్టర్‌, ఫడణవీస్‌లను సీఎంలుగా ఎంపిక చేసింది.

యోగి నిరూపించుకోవాలి

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన సత్తా ఏంటో ఇంకా నిరూపించుకోలేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన్ను సీఎంగా ఎంపిక చేసింది భాజపా అధిష్ఠానమే. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే గానీ ఆయన్ను జనాకర్షక నేతగా పరిగణించలేం! ఉత్తరాఖండ్‌లోనూ కమలదళానికి ఆకర్షణీయ నేతలెవరూ లేరు. నాలుగు నెలల వ్యవధిలో అక్కడ రెండుసార్లు సీఎం లను మార్చాల్సి వచ్చింది. మోదీ ప్రధాని అయ్యాక.. గుజరాత్‌లోనూ భాజపాకు జనాకర్షణ ఉన్న నేతలు కరవయ్యారు.

మధ్యప్రదేశ్‌లో శివరాజ్​సింగ్‌ చౌహాన్‌ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కాంగ్రెస్‌ నుంచి తన మద్దతుదారులతో జ్యోతిరాదిత్య సింధియా ఫిరాయించడం వల్లే ఆ రాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్నిఏర్పాటుచేయగలిగింది. వసుంధరా రాజె క్రియాశీలకరాజకీయాలకు దూరంగా ఉండటంతో రాజస్థాన్​లోనూ పార్టీ ఇబ్బంది పడుతోంది.

ఇవీ చదవండి:

సీఎం రేసులో ఆ 9 మంది- అవకాశం ఎవరికి?

కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే...

యడియూరప్ప రాజీనామా- భవిష్యత్​పై కీలక వ్యాఖ్యలు

కర్ణాటకకు కొత్త సీఎం ఎవరు?

ABOUT THE AUTHOR

...view details