BSP Mayawati Heir Akash Anand :బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. ఆ పార్టీ షాజహాన్‌పుర్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వీర్ సింగ్ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను మాయవతి ఆనంద్‌కు అప్పగించినట్లు తెలిపారు. లఖ్‌నవూలో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆకాశ్ ఆనంద్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీలోమాయావతితర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వారసత్వ రాజకీయాల పట్ల ఎప్పుడూ విమర్శలు గుప్పించే మాయావతి 2019లో తన తమ్ముడు ఆనంద్ కుమార్‌ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. తాజాగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తన వారసుడిగా ప్రకటించడం గమనార్హం.
"ఆకాశ్ ఆనంద్‌ను మాత్రమే తన వారసుడిగా ఆమె( మాయావతి) ప్రకటించారు. ఎందుకంటే ఆమె కీలక బాధ్యతలు అప్పగించిన వారు విధినిర్వహణలో విఫలమయ్యారు. ఆకాశ్ ముున్ముందు గొప్పనాయకుడిగా నిరూపించుకుంటారనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి మా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో నైతికతను పెంపొందించే బాధ్యతను పార్టీ ఆయనకు అప్పగించింది. "