BSP 2024 Lok Sabha Election :2024 సార్వత్రిక ఎన్నికలను బహుజన్ సమాజ్‌వాది పార్టీ-BSP ఒంటరిగానే ఎదుర్కొంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి తెలిపారు. ఎన్నికల అనంతర పరిస్థితులను బేరీజు వేసుకొని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనేది లేదని ఆదివారం లఖ్‌నవూలో స్పష్టం చేశారు. దళితులు, ఆదివాసీలు, ముస్లింల మద్దతుతో తాము 2007లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అదే భరోసాతో ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగా వెళుతున్నామని పేర్కొన్నారు. కులతత్వం, మతతత్వాన్ని విశ్వసించే వారితో దూరంగా ఉంటామని, ఏ కూటమిలోనూ చేరబోమని అన్నారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి ఉపాధి కల్పించకుండా కేంద్రం, యోగి సర్కార్ ఉచిత రేషన్ అందించి వారిని తమ బానిసలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
"కూటముల్లో చేరడం వల్ల మా పార్టీకి ఎప్పుడూ ప్రయోజనం కలగలేదు. ప్రతిసారి మాకు నష్టమే జరిగింది. అందుకే చాలా పార్టీలు మాతో జట్టుకట్టేందుకు ఆసక్తితో ఉన్నాయి. మేమైతే ఎన్నికల తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం. ఫలితాల తర్వాత అవసరమైతే ఎవరికైనా మద్దతు ప్రకటిస్తాం. పోటీ మాత్రం ఒంటరిగానే ఉంటుంది.
గత నెలలో ఆకాశ్ ఆనంద్‌ను నా రాజకీయ వారసుడిగా ప్రకటించిన తర్వాత నుంచి నా రిటైర్మెంట్పై వార్తలు వస్తున్నాయి. త్వరలోనే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. పార్టీ బలోపేతానికి నేను పనిచేస్తూనే ఉంటా."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి