BSF raising day celebration: దేశ భద్రతకు డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటి విధ్వంసక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రతే.. దేశ భద్రతని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) 57వ రైజింగ్ డే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఎస్‌ఎఫ్, డీఆర్‌డీఓ, ఎన్‌ఎస్‌జీ మూడు కలిసి సంయుక్తంగా డ్రోన్ విధ్వంసక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయని అమిత్ షా తెలిపారు. మన శాస్త్రవేత్తలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరిహద్దు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సరిహద్దుల్లో చొరబాట్లు, భద్రతా దళాలపై దాడులు.. ఇలా ఎలాంటి ముప్పు తలెత్తినా వెంటనే తిప్పికొట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే మెరుపు దాడులు, వైమానిక దాడులు నిర్వహించామని తెలిపారు. దీన్ని యావత్తు ప్రపంచం ప్రశంసించిందన్నారు.
అలాగే 50 వేల మంది జవాన్లను కొత్తగా నియమించామని, వారికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందన్నారు. 2008-14 మధ్య రూ.23,000 కోట్లుగా ఉన్న సరిహద్దు రోడ్ల నిర్మాణ బడ్జెట్‌ను మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.44,600 కోట్లకు పెంచినట్లు తెలిపారు.