సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి భారత్‌లో అక్రమంగా చొరబాట్లను అడ్డుకునేందుకు సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతికత సాయంతో డేగ కన్ను వేసి.. సరిహద్దుల్లో గస్తీని మరింత ముమ్మరం చేయనుంది. మొట్టమొదటిసారి జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ మౌంటెడ్ గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్లను సరిహద్దు భద్రతా దళం మోహరించింది. వీటి సాయంతో భూమి లోపల ఉన్న సొరంగాలను పైనుంచే గుర్తించేందుకు వీలుంటుంది. జమ్ముకశ్మీర్‌తో పాటు భారత భూభాగంలోకి సొరంగాల నుంచి ఉగ్రమూకలు చొరబడకుండా అడ్డుకునేందుకు దేశీయంగా తయారుచేసిన ఈ సాంకేతిక పరికరం సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. ఆయుధాలు, మత్తు పదార్థాలను అక్రమంగా భారత్‌లోకి తరలించేందుకు ప్రయత్నించినా ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ గుర్తుపడుతుంది.
ఈ రాడార్ల నుంచి వచ్చే బలమైన రేడియో తరంగాలు సొరంగాలను గుర్తించడానికి, వాటి మార్గాన్ని కనుగొనేందుకు ఉపయోగపడతాయని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ రాడార్లకు సంబంధించి మరింత సమాచారాన్ని వెల్లడించేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఈ రాడార్లను డ్రోన్లకు ముందు భాగంలో అమర్చడం వల్ల సైన్యం వెళ్లలేని ప్రాంతాలకు కూడా వెళ్లి సొరంగాలను గుర్తించేందుకు వీలుంటుందని అధికారులు వివరించారు. సాధారణంగా సరిహద్దు కంచెకు 400 మీటర్ల దూరంలో ఉన్న సొరంగాలను గుర్తించే సామర్థ్యం ఈ రాడార్లు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. డ్రోన్ల సాయంతో రాడార్ల ద్వారా బీఎస్ఎఫ్ సిబ్బంది సొరంగాలను గుర్తించవచ్చని తెలిపారు.