భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్థాన్ బోట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని కచ్ జిల్లా హరమినాలా ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఈ బోట్లను గుర్తించారు అధికారులు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు ప్రవేశించాయి అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. ఆ బోటుకు సంబంధించిన వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఘటనాస్థలంలో దట్టమైన చెట్లు ఉండటం, అలలు తీవ్రంగా ఉండటం వల్ల సైనికులకు గాలింపు చర్యలు చేపట్టడం సవాల్‌గా మారిందన్నారు అధికారులు పేర్కొన్నారు.
పాక్ చెరలో భారత జాలర్లు..
గడిచిన 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్థాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్థాన్ అపహరిస్తోందని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు ఇటీవల అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్ 50కుపైగా భారత జాలర్లను అపహరించింది.
అంతకుముందు.. తమ చెరలో ఉన్న కొంతమంది భారత జాలర్లను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నామని పేర్కొంటూ పాక్ వారిని విడుదల చేసింది. కానీ అది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ జాలర్ల అపహరణలు మొదలు కావడం గమనార్హం.
ఇదీ చూడండి :మహిళలతో బాడీ మసాజ్ కోసం దొంగతనాలు.. రూ.వేలల్లో టిప్పు