మహిళలు ట్రాక్టర్ లాగుతుంటే మాజీ సీఎం మౌనంగా కూర్చోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. రాజకీయాల్లో అతివలను వెట్టి కార్మికుల్లా చూస్తారా అని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా చేసిన నిరసన ప్రదర్శనను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
"కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తాళ్లతో ట్రాక్టర్ను లాగుతుంటే.. మాజీ సీఎం సహా ఇతర నేతలు మౌనంగా కూర్చోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. నిరసన తప్పుకాదు. కానీ అందుకోసం మహిళల గౌరవాన్ని ఫణంగా పెట్టకూడదు. ఈ వ్యవహారంపై సోనియా గాంధీ మౌనం వహించడం ఆ పార్టీలో మహిళల దుస్థితికి అద్దంపడుతోంది."
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి
కేంద్ర ప్రభుత్వం ఇందన ధరలను పెంచడాన్ని నిరసిస్తూ హరియాణా అసెంబ్లీకి సోమవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు బీఎస్ హూడా. ఈ క్రమంలో ఆయన వాహనంపై కూర్చోగా.. మహిళా నేతలు దానిని లాగారు.
హుడా చర్యను తప్పుబడుతూ దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భాజపా మహిళా విభాగం ఆందోళన చేపట్టింది.