BRS Never Win in 17 Assembly Segments : తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు అడుగుపెట్టని నియోజకవర్గాలు.. భారత రాష్ట్ర సమితికి సవాల్ విసురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో(Assembly Segments) గులాబీ జెండా ఎగరేయలేక పోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు, హైదరాబాద్‌లో పది స్థానాలు గులాబీ పార్టీకి అందని ద్రాక్షల్లాగే ఉండిపోయాయి. ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు మినహాయిస్తే మిగతా పదింటిలో ఈసారైనా గెలవాలన్న పట్టుదలతో.. ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.
కాంగ్రెస్ నేతలు పెట్టేది భూమాత కాదు భూ'మేత' - ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యమే : సీఎం కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, చంద్రాయణగుట్ట, యాఖత్ పురా, బహదూర్ పురా, మలక్ పేట, కార్వాన్, నాంపల్లిలో ఈసారి కూడా బీఆర్ఎస్ పోటీ నామామత్రంగానే ఉంది. ఆ ఏడింటిలో గులాబీ పార్టీ గెలిచే అవకాశం లేదు. గోషామహల్ నియోజకవర్గంలో ఈసారి జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్(BRS Party) ధీమా వ్యక్తం చేస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నేత రాజాసింగ్ విజయం సాధించారు.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేం సింగ్ రాథోడ్‌పై గెలిచారు.
Telangana Assembly Election 2023 : ఈ ఎన్నికల్లో నందకిషోర్ వ్యాస్‌ను బరిలోకి దించగా.. కాంగ్రెస్ నుంచి ఎం.సునీత పోటీలో ఉన్నారు. సుమారు 30వేల మైనారిటీ ఓట్లున్న(Minority Votes) గోషామహల్‌లో మజ్లిస్ అభ్యర్థిని నిలపలేదు. ఎంఐఎం సహకారంతో మైనారిటీ ఓట్లు సాధిస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ ఉంది. మరోవైపు నియోజకవర్గంలో ప్రభావం చూపే ఉత్తర భారతదేశానికి చెందిన సెటిలర్లు, మార్వాడీ సామాజికవర్గం ఓట్లు నందకిషోర్ వ్యాస్‌కే పడతాయని అంచనా వేస్తోంది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఇప్పటివరకు జెండా ఎగరేయలేక పోయింది. 2014లో టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య విజయకేతనం ఎగరేయగా.. కారు పార్టీ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్ రెండో స్థానంలో.. కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎం.రామ్మోహన్ గౌడ్‌పై.. కాంగ్రెస్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గెలిచారు. ఇప్పుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ మధుయాష్కీ గౌడ్‌ను(Madhuyashki Goud) బరిలోకి దించింది.
బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే-పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్
BRS Election Campaign Josh in Telangana :ద్విముఖ పోరులో గెలుపు తమదేనని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మహేశ్వరం నియోజకవర్గంలో 2014లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతి విజయం సాధించారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి సబితా బరిలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో గట్టి పోటీ ఇస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట, సత్తుపల్లి, మధిర, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అడుగుపెట్టలేక పోయింది. 2014 ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లకే పరిమితమైన గులాబీ పార్టీ.. 2018లో కొంతమేర పుంజుకున్నప్పటికీ.. విజయతీరాలను మాత్రం చేరలేకపోయింది. పినపాకలో 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించిన పాయం వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొని.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓటమిపాలయ్యారు.
BRS Political Strategy in Telangana :ఇప్పుడు రేగా కాంతారావు బీఆర్ఎస్ తరఫున.. పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తరఫున తలపడుతున్నారు. భద్రాచలంలోనూ బీఆర్ఎస్కు గత రెండు ఎన్నికల్లో చుక్కెదురైంది. 2014లో సీపీఎం(CPM Party) నేత సున్నం రాజయ్య గెలవగా.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఈసారి తెల్లం వెంకట్రావు బరిలో ఉన్నారు. అశ్వరావుపేటలో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు గెలవగా.. 2018లో తెలుగుదేశం అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పుడు మెచ్చా నాగేశ్వరరావు.. గులాబీ జెండాతో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.