BRS Manifesto Telangana 2023 :తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేశారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి ఇతర పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మరో కొత్త హామీ ఇచ్చారు. రైతు బీమా తరహాలో.. తెల్ల రేషన్ కార్డుదారులకు... బీమా అమలు చేస్తామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి... పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ భరోసా కల్పించారు.
BRS Manifesto 2023 : తెల్లరేషన్ కార్డుదారులకు 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా'.. రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్ - బీఆర్‌ఎస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టో

Published : Oct 15, 2023, 2:26 PM IST
|Updated : Oct 16, 2023, 6:36 AM IST
12:12 October 15
BRS Manifesto Telangana 2023 : రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా'
BRS Manifesto 2023 :బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలో వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా చేయిస్తామని.. 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కేసీఆర్ బీమా...ప్రతి ఇంటికి ధీమా అని అభివర్ణించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తామని.. 'తెలంగాణ అన్నపూర్ణ' పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. మరోవైపు దశల వారీగా ఆసరా పింఛన్ల మొత్తం పెంపు ఉంటుందని చెప్పారు. మొదటి ఏడాది రూ.3 వేలు పెంచి.. ఏటా రూ.5వందల చొప్పున రూ.5వేల వరకు పెంచుతామని వెల్లడించారు.
"దివ్యాంగుల పింఛను రూ.6 వేల వరకు పెంచుతాం. తొలి ఏడాది రూ. 5వేలకు పెంపు ఉంటుంది. దివ్యాంగుల పింఛను ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3వేలు చొప్పున భృతి అందిస్తాం. రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేల వరకు పెంచుతాం. రైతు బంధు మొదటి సంవత్సరం రూ.12 వేల వరకు పెంపు ఉంటుంది. సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు అందిస్తాం. అర్హులైన లబ్ధిదారులకు రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం." -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయరంగంలోతెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని చెప్పారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చామని వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉండేవన్న కేసీఆర్.. కరెంట్, నీటి సౌకర్యాలు ఉండేవి కావని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశామని.. కల్యాణలక్ష్మి పథకం ఎవరూ అడగకపోయినా అమలు చేశామని.. ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలుచేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
"దళితబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. దళితబంధును కొనసాగిస్తాం. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. భవిష్యత్‌లోనూ గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం. లంబాడీ తండాలు, గోండు గూడెలను పంచాయతీలు చేస్తాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు క్లిష్ట పరిస్థితులు ఉండేవి. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. బీసీల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం." అని కేసీఆర్ హామీ ఇచ్చారు.