BRS Leaders Demanded Change Party Name : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా మార్చాలని ఆ పార్టీ శ్రేణులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా నిర్వహిస్తున్న లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో(Lok Sabha Elections Preparatory Meetings) జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి విశ్లేషణలను కొనసాగిస్తూనే, మరోవైపు ఎక్కువ మంది పార్టీ నాయకులు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విన్నవిస్తున్నట్లు తెలిసింది. తాజాగా బుధవారం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి - పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
మళ్లీ తెర మీదకి టీఆర్ఎస్ : 'తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉంది. పార్టీ పేరులో తెలంగాణను తొలగించి, భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. బీఆర్ఎస్ తమది కాదనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది. కనీసం 1-2 శాతం ప్రజల్లో ఆ భావన ఏర్పడినా, మన పార్టీకి ఆ మేరకు ఓట్లు దూరమయ్యాయనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. బీఆర్ఎస్గా మారిన తర్వాత అంతగా కలిసి రాలేదనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని మాతో ప్రస్తావిస్తున్నారు.