BRS Assembly Election Campaign 2023 : ఎన్నికల యుద్ధంలో అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీస్తున్న గులాబీ దళం.. ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది. ఓ వైపు గులాబీ దళపతి కేసీఆర్.. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సుడిగాలి పర్యటనలతో జోష్ పెంచారు. ఎన్నికల షెడ్యూలు రాగానే నియోజకవర్గాల బాట పట్టిన గులాబీ నేతలు ఓట్ల వేటలో అందరి కంటే ముందున్నారు. రోజుకు మూడు నుంచి 4 ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొంటున్న సీఎం కేసీఆర్ ప్రసంగాల్లో ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచుతున్నారు. ఈనెల 25న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు కలిపి పరేడ్ గ్రౌండ్స్‌లో ఒకే సభను నిర్వహించనున్నారు. హైదరాబాద్ సభ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో.. భారీగా జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 28న ప్రచారం చివరి రోజున వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి ఒకే సభ నిర్వహించి.. తర్వాత గజ్వేల్‌లో ప్రచారం ముగించనున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్, ధరణి, రైతుబంధు కాట్ల కలవడం ఖాయమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆదమరిచి ఓటేస్తే.. మళ్లీ పాతరోజులు రావటం ఖాయమంటూ హితవుపలుకుతున్నారు.
ప్రచారంలో స్పీడ్ పెంచిన కారు - యువ ఓటర్లపై స్పెషల్ ఫోకస్
Telangana Assembly Elections 2023 :గులాబీ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక నజర్ పెట్టిన కేటీఆర్ ఈ నెల 15 నుంచి రోడ్ షోలు విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు కలుస్తున్నారు. పదేళ్లలో నగరాభివృద్ధికి చేసిన మంచి పనులను వివరిస్తున్నారు. హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. పదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయాలని అభ్యర్థుల నుంచి అధినేత వరకు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఎదురుదాడి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టాలని.. పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్లినట్లేనని.. రిస్క్ తీసుకోవద్దని సూచిస్తున్నారు.
BRS Praja Ashirvada Sabha : అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల క్రితమే సిద్ధమైన గులాబీ పార్టీ.. ప్రచారాన్ని వ్యూహాత్మకంగా క్రమంగా వేగం పెంచుతూ వచ్చింది. ఎన్నికల షెడ్యూలు రాకముందే.. సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ.. మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభాలు, శంకుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్లింది. ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. పార్టీలో అసంతృప్తులు కొంత మేరకు సర్దుబాట్ల కొలిక్కి రాగానే.. ప్రచారంపై దృష్టి పెట్టింది. ప్రచార గడువు ముగిసేలోగా.. ప్రతీ ఓటరును కనీసం మూడు, నాలుగు సార్లు కలవాలని అభ్యర్థులకు బీఆర్ఎస్ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేశారు.
17 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎగరని బీఆర్ఎస్ జెండా - ఈసారైనా గులాబీ గాలి వీచేనా?