పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు.
" ఈ దశాబ్దానికి పార్లమెంట్ తొలి సెషన్ నేడు ప్రారంభం కానుంది. దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యం. మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసేందుకు బంగారం లాంటి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఈ అంశాలపైనే ఈ సారి సమావేశాలు సాగాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అంశాలపైనే చర్చలు జరగాలి. ఇది బడ్జెట్ సెషన్. దేశ చరిత్రలో తొలిసారి గతేడాది ఆర్థిక మంత్రి పలు ప్యాకేజీల రూపంలో 4-5 మినీ బడ్జెట్లు ప్రవేశపెట్టారు"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కాగా.. సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నేపథ్యంలో తొలి రోజు సమావేశాల్లో గందరగోళం తలెత్తే అవకాశాలున్నాయి. ఈ అంశంపై తొలి రోజే నిరసన చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే..
పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి చేసే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం రాజకీయాలకతీతమైనదని, సభ్యులందరూ హజరుకావాల్సిందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి అగౌరవాన్ని కలిగించే విధంగా ప్రతిపక్షాల చర్య ఉందని కేంద్ర మంత్రి, భాజపా ఎంపీ గిరిరాజ్ సింగ్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాకపోవడం.. ప్రజాస్వామ్య గౌరవాన్ని అవమానించడమేనని ఆరోపించారు. .
ఇదీ చదవండి:'రిపబ్లిక్ డే' ఘటన బాధ కలిగించింది: రాష్ట్రపతి