అక్కాతమ్ముళ్లను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనలో వారి తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈ దారుణం జరిగింది. మృతులను శ్వేతా సింగ్ (17), ప్రవీణ్కుమార్లుగా (14) గుర్తించారు పోలీసులు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తల్లి చెప్పిన వివరాల ప్రకారం..: జనక్ నగర్లో నివసిస్తున్న వారి ఇంటికి శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ముగ్గురు దుండగులు వచ్చారు. కుమార్తె శ్వేత తలుపు తీసిన వెంటనే ఆమెపై సుత్తితో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత ఆమె తమ్ముడు ప్రవీణ్ సహా తల్లి చందాదేవిపై కూడా దాడి చేశారు. ముగ్గురూ చనిపోయారని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో శ్వేత ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ప్రవీణ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చందాదేవి పరిస్థితి విషమంగా ఉంది.