సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ(బీఆర్ఓ) మరో రికార్డు సృష్టించింది. 8 రోజుల్లోనే.. లేహ్-సార్చు రహదారిపై ఉన్న 110 అడుగుల పొడవైన వంతెనను పునరుద్ధరించింది. మనాలీ ప్రాంతాన్ని కలిపే ఈ రహదారిపై ఆర్మీకి చెందిన వాహనాలు, కాన్వాయ్‌లు రాకపోకలు సాగిస్తుంటాయి.
క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య..
విస్కీ నల్లాహ్ ప్రాంతంలో ఉన్న ఈ బెయిలీ వంతెన.. శీతాకాలంలో కురిసిన భారీ మంచుతో పూర్తిగా క్షీణించిపోయింది. ఈ క్రమంలో ఈ వంతెనకు ఉన్న ప్రాముఖ్యతను గ్రహించిన బీఆర్ఓ రంగంలోకి దిగింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఏప్రిల్ 5 నుంచి 12 మధ్య ఈ వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టి.. విజయవంతంగా పూర్తి చేసింది.
వేసవి కాలంలో లద్దాఖ్‌లోని ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ వంతెనను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. వంతెనలోని కలప స్థానంలో ఉక్కును ఉపయోగించి పునర్నిర్మించినట్లు చెప్పారు. బీఆర్ఓ కృషి పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం