వ్యాపారం కోసం భారత్‌కు వచ్చి, పగ్గాలు చేపట్టిన ఈస్టిండియా కంపెనీ తొలుత తెల్ల సైనికులను కొంతమందిని వెంట తెచ్చుకున్నా.. తర్వాత స్థానికులకే జీతాలిచ్చి సిపాయిలుగా తీసుకుంది. పనికొస్తారనుకున్న అందరినీ నియమించేవారు. కానీ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ స్థానంలో భారత పాలనను చేతిలోకి తీసుకున్న బ్రిటిష్ సర్కారు వ్యూహం మార్చింది. భారతీయులందరికీ సైన్యంలో సమ ప్రాధాన్యం లేకుండా చేసింది. కొంతమందికే పెద్దపీట వేసింది. ఇందుకు కారణం- 1857 తిరుగుబాటే!
1857లో తెల్లవారిపై తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించింది బెంగాల్ సైనికులు. అందుకే.. రాణి పాలన మొదలవగానే ఆంగ్లేయ యుద్ధ నిపుణుడు ఫ్రెడ్రిక్ స్లే రాబర్ట్స్ సిఫార్సుల మేరకు సైనిక భర్తీలో భారీ మార్పులు చేశారు. పీల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి.. మాట వినే సామాజిక వర్గాలను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. తిరుగుబాటుకు కారణమైన బెంగాల్ సైన్యం రూపురేఖలు మార్చారు. ప్రాంతాలవారీగా కాకుండా సైన్యాన్ని జాతుల వారీగా విభజించారు. అంతేగాకుండా అంతగా చదువుకోని, ఆలోచించకుండా తమ ఆదేశాలు అమలు చేస్తూ, విశ్వాసపాత్రులుగా ఉండేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ.. భారత్‌లో పాలన పగ్గాలు చేపట్టేప్పుడు బ్రిటిష్ రాణి విక్టోరియా.. భారతీయులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ఎలాంటి వివక్ష చూపించబోమంటూ హామీ ఇచ్చారు. కాబట్టి సైన్యంలో కొందరికే ప్రవేశమంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆంగ్లేయులు తమ 'విభజన' అస్త్రాన్ని ప్రయోగించారు.
కులాలవారీగా పోరాట జాతులు, పోరాడలేని జాతులుగా ముద్ర వేశారు. శారీరక దృఢత్వానికి తోడు, తాము చెప్పినమాట వినేతత్వమున్న వారినే పోరాట జాతులని పేరుపెట్టి వారిని మాత్రమే సైన్యంలోకి తీసుకోవటం మొదలెట్టారు. (జలియన్‌వాలాబాగ్‌లో డయ్యర్ ఆదేశాలతో నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది గూర్ఖా రెజిమెంటే) పంజాబ్, గూర్ఖా, పఠాన్, రాజ్‌పూత్‌లకు సైన్యంలో పెద్దపీట వేశారు. పఠాన్‌లలో చాలామంది ఇతర కళలు, నైపుణ్యాలతో జీవనం సాగిస్తుంటే వారిని బలవంతంగా సైనిక అవసరాలకు మళ్లించారు. సైన్యంలో చేరటానికి ఇష్టంలేని వారిని కూడా.. తమ నైపుణ్యాన్ని ఆయుధాల తయారీకి వినియోగించేలా ఒత్తిడి చేశారు. బెంగాలీలు, మరాఠాలు, దక్షిణాది వారిలో పోరాట పటిమ లేదని.. వాయువ్య ప్రాంతాల్లోని వారే పోరాటయోధులని ఫ్రెడ్రిక్ రాబర్ట్స్ సూచించారు. అంటరాని కులాలనూ పోరాటాలకు పనికిరానివారిగా ఆయన ముద్రవేశాడు.