తెలంగాణ

telangana

ETV Bharat / bharat

British Rule in India: సొమ్ము మనది.. సోకు బ్రిటన్‌ది.. - ఆంగ్లేయుల పాలన

British Rule: జీవితకాలంలో చూడలేనంత సొమ్ము, ఆభరణాలు, విలువైన వస్తువులను భారత్‌ నుంచి బ్రిటన్‌కు తరలించి.. తమ రాజకుటుంబానికి వాటిలో వాటాలిచ్చి.. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంతగా దోచుకున్న ఆంగ్లేయులు.. మన డబ్బంతా పోసి వారి డాబూ దర్పాల్ని ప్రదర్శనకు పెట్టారు. బ్రిటన్‌లో కూడా జరగనంత అంగరంగ వైభవంగా దిల్లీ దర్బార్‌ను నిర్వహించి.. 1911లో ఇంగ్లాండ్‌ రాజ దంపతులకు పట్టాభిషేకం చేశారు.

British Rule
British Rule

By

Published : Dec 12, 2021, 8:01 AM IST

British Rule in India: 1877లో విక్టోరియా రాణి పేరిట, 1903లో రాజు ఎడ్వర్డ్‌-7 పేరిట దర్బార్‌లు నిర్వహించినా.. బ్రిటన్‌ రాజ కుటుంబం ఎన్నడూ వీటికి రాలేదు. కానీ 1911 డిసెంబరు 12 నాటి దర్బార్‌కు కింగ్‌జార్జ్‌-5, రాణి మేరీలు స్వయంగా హాజరవటంతో భారత్‌లోని బ్రిటిష్‌ అధికారులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

1911 మార్చిలో భారత్‌కు వెళ్లాలన్న తన కోరికను కింగ్‌ జార్జ్‌-5 వెలిబుచ్చటంతో.. డిసెంబరు 12నాటి దర్బార్‌కు యుద్ధ ప్రాతిపదికన అంతా సిద్ధమైంది. ఈ పర్యటనకయ్యే ఖర్చు ఆ కాలంలోనే 7లక్షల పౌండ్లుగా అంచనా వేశారు. భారత ప్రభుత్వమే (బ్రిటిష్‌) ఈ మొత్తాన్ని భరించేలా ప్రణాళిక సిద్ధమైంది. దిల్లీ ఉత్తర భాగంలో (ప్రస్తుత కరోనేషన్‌ పార్క్‌ ప్రాంతం) తాత్కాలిక కొత్త పట్టణం నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. 30 గ్రామాలను ఖాళీ చేశారు. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 40వేల టెంట్లు వేశారు. ఇదంతా కూడా.. రాజకుటుంబీకులతో పాటు వచ్చే అతిథులు ఉండటానికి మాత్రమే. రాజు, రాణిల క్యాంపునకు దగ్గర్లో ఎవ్వరికీ చోటివ్వకుండా.. చుట్టూ శానిటరీ జోన్‌ను ఏర్పాటు చేశారు. కొత్త రోడ్లు, పార్కులు తయారయ్యాయి. మిలిటరీ దళాల కోసం, ఆటపాటల కోసం, ఆరోగ్య కేంద్రాల కోసం.. రాజదంపతులు అతిథులను కలవటానికి, ప్రజలకు దర్శనం ఇవ్వటానికి, పరేడ్‌ను తిలకించటానికి.. ఇలా ప్రతిదానికీ ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. ఈ దర్బార్‌కు అతిథిగా వచ్చే నిజాం మహారాజే తన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని లక్ష పౌండ్లు పంపించారు.

డిసెంబరు 2న ముంబయిలో అడుగుపెట్టిన రాజదంపతులకు గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నిర్మాణంతో ఘనంగా ఆహ్వానం పలకాలనుకున్నారు. కానీ సమయానికి అది పూర్తి కాలేదు. దీంతో కార్డ్‌బోర్డుతో తాత్కాలికంగా దాన్ని తయారు చేసి పనికానిచ్చారు. డిసెంబరు 7న రాజ దంపతులిద్దరూ రైలులో దిల్లీ చేరుకున్నారు.

రెండున్నర లక్షల మందితో.

డిసెంబరు12న జరిగిన ఈ పట్టాభిషేకానికి ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రజల్ని రప్పించారు. సుమారు రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. 20వేల మందితో కూడిన సైన్యం కవాతు చేసింది. సంస్థానాధీశులంతా వచ్చి రాజదంపతుల ముందు మూడుసార్లు వంగివంగి సలామ్‌ చేస్తూ.. వెన్ను చూపించకుండా అలాగే వెనకాలకు నడుస్తూ వెళ్లారు. (ఒక్క బరోడా మహారాజు సాయాజీరావు మాత్రం ఒక్కసారే వంగీవంగనట్లుగా తలవంచి.. వెన్నుచూపిస్తూ వెళ్లిపోయారు.) మేవాడ్‌ రాజు మహారావు దిల్లీ రైల్వే స్టేషన్‌ దాకా వచ్చి.. రాజుకు తలవంచటం ఇష్టం లేక.. తన ప్రత్యేక రైలును వెనక్కి మళ్లించారు. భారత్‌లోని తమ యంత్రాంగం చేసిన హంగూ ఆర్భాటాలతో సంతుష్టుడైన కింగ్‌జార్జ్‌ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అమ్మో ఇంత బరువా.. తలనొస్తోంది!

పట్టాభిషేకమంటే.. హంగూ ఆర్భాటంతో కిరీట ధారణ చేయాలి. రాజు ఒక్కడికి పెడితే బాగుండదు.. కాబట్టి ఆయనతో పాటు రాణికి కూడా కిరీటం తప్పనిసరి. ఇంకేం.. భారతీయులను పీల్చిపిప్పి చేసి గుంజిన డబ్బులు, సంస్థానాధీశుల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాలతో.. కొత్త కిరీటాలు తయారు చేయించారు. 2వేల వజ్రాలు, పది పచ్చలు పొదిగిన ప్లాటినం బంగారంతో తయారు చేసిన కిరీటం సిద్ధమైంది. ఇక రాజుకేమో.. 6100 వజ్రాలు, వైఢూర్య, మరకత మాణిక్యాలు పొదిగిన కిలో బరువైన కిరీటం చేయించారు. సంబరంగా పట్టాభిషేకం చేసుకొని దీన్ని తలపై పెట్టుకున్నాక.. "అమ్మో.. ఈ కిరీటం మామూలు బరువు లేదు. మూడున్నర గంటలపాటు దీన్ని ధరించటంతో తలనొప్పి మొదలైంది" అంటూ వ్యాఖ్యానించాడు కింగ్‌ జార్జ్​. సుమారు లక్ష వెండిరూపాయి నాణేలను కరిగించి.. రాజురాణికి ప్రత్యేక సింహాసనాలు తయారు చేయించింది కోల్‌కతా రాయల్‌ మింట్‌.

ఇదీ చూడండి:Azadi ka Amrit Mahotsav: గాంధీ మన్ననలు పొందిన తెలుగు ధీరవనిత

ABOUT THE AUTHOR

...view details