British Rule In India: 'కోర్టు కోర్టుకో తీర్పా? యువరానర్'... ఓ సినిమాలో ఎన్టీఆర్ నోట వచ్చే ఈ డైలాగ్ ఇప్పటికీ చాలామందిని ఆలోచింపజేస్తుంటుంది. ఆంగ్లేయ పాలకుల హయాంలో అమలైన జాతి జాతికో న్యాయం తీరు వింటే ఇంకా ఆశ్చర్యపోతాం. బ్రిటిష్ పాలనలో నిందితుడి రంగు, జాతి.. నేర నిర్ధారణ, శిక్ష ఖరారును ప్రభావితం చేసేవి. భారతీయులపై తెల్లవారు నేరం చేస్తే తక్కువ శిక్ష పడితే.. తెల్లవారి పట్ల నేరానికి భారతీయులు భారీ శిక్ష అనుభవించాల్సి వచ్చేది. చెప్పిన మాట వినలేదని ఓ ఆంగ్లేయుడు తన భారతీయ పనివాడిని కాల్చిచంపాడు. ఇందుకు అతనికి ఆరునెలల కారాగారం, రూ.100 జరిమానా విధించారు. ఓ భారతీయుడు ఆంగ్లేయ అమ్మాయిపై అత్యాచారయత్నం చేశాడనే అభియోగంపై 20 సంవత్సరాల కఠినకారాగార శిక్ష వేశారు. ఆంగ్లేయుల చేతిలో భారతీయులు చనిపోతే చాలామటుకు దాన్ని అనుకోకుండా జరిగిన (యాక్సిడెంటల్) సంఘటనగా, లేదంటే ఆత్మరక్షణ చర్యగా అభివర్ణించేవారు. అదే భారతీయులు చేసినవాటిని మాత్రం అతి తీవ్రనేరంగా పరిగణించేవారు.
నేరం ప్లీహందే?
AZADI KA AMRIT MAHOTSAV: ఆ కాలంలో మలేరియా బారిన పడి చాలామంది భారతీయుల ప్లీహం పెరిగేది. ఇలాంటి వారిని ఎవరైనా కడుపులో తన్నితే అది త్వరగా చిట్లి మరణం సంభవిస్తుందంటూ ఆంగ్లేయ శాస్త్రవేత్తలు అప్పట్లో పరిశోధన పత్రం సమర్పించేవారు. బ్రిటిష్ యజమానులు తమ ఇళ్లలోని పని వారిని బూటుకాలుతో కడుపులో తన్నటం సహజంగా జరిగేది. ఓసారి ఆంగ్లేయ యజమాని పడుకున్నప్పుడు వింజామర వీచేందుకు ఓ మనిషిని పెట్టుకున్నాడు. రాత్రి ఆ పనిమనిషికి కూడా పొరపాటున కునుకు పట్టింది. వింజామర ఆగింది. నిద్రాభంగమై లేచిన యజమాని కోపంతో.. తన కాలుతో కడుపులో తన్నడంతో పనిమనిషి చనిపోయాడు. చివరకు ఆంగ్లేయ న్యాయమూర్తులు ఏం తేల్చారంటే.. 'పనిమనిషి ప్లీహం అప్పటికే పెరిగి ఉంది. ఏ కొద్ది దెబ్బకైనా అది చిట్లేదే. కాబట్టి.. యజమాని చేసింది చిన్న గాయమే' అంటూ నిందితుడికి 15 రోజుల శిక్ష విధించి, చనిపోయిన పనిమనిషి భార్యకు రూ.30 పరిహారం ఇప్పిస్తూ తీర్పునిచ్చారు. చాలా కేసుల్లో ఈ మలేరియా, ప్లీహం.. సంబంధం భారతీయులను చంపే ఆంగ్లేయుల పాలిట వరమయ్యేది.
Indian Independence News: యూరోపియన్ల నేరాలపై చూసీ చూడనట్లుగా వ్యవహరించటం, వాటిని తక్కువ చేసి చూపడం, తిమ్మినిబమ్మిని చేయడం ఆంగ్లేయ న్యాయవ్యవస్థకు అలవాటుగా మారింది. బెంగళూరు వద్ద జరిగిన ఓ సంఘటనలో.. ఇద్దరు యూరోపియన్ అధికారులు లెఫ్టినెంట్ థాంప్సన్, నీల్ కాల్పులు జరిపారు. ఓ అబ్బాయి చనిపోయాడు. ఆగ్రహంతో ఆ ఊరి ప్రజలు యూరోపియన్ల తుపాకీని లాక్కొన్నారు. చివరకు ఈకేసు.. యూరోపియన్లపై గ్రామస్థుల దాడిగా మారి.. వారి తుపాకీని అన్యాయంగా లాక్కొన్నారనే కారణంతో ఇద్దరు గ్రామస్థులను ఆరు నెలలు జైలుకు పంపించారు. బాలుడిని చంపిన యూరోపియన్లను విడిచి పెట్టారు.