1857 నాటి తొలి స్వాతంత్య్ర యుద్ధంలో సిపాయిలతో పాటు అనేక ఆదివాసీ తెగలు కూడా తెల్లవారిపై తిరుగుబాటు చేశాయి. అవంతిబాయి లోధి, ధన్‌సింగ్ గుర్జార్‌లాంటి ఆదివాసీ నేతలు తమకు సహకరించకుండా తిరుగుబాటుకు తోడ్పాటునందించటం బ్రిటిష్‌వారికి ఆందోళన కలిగించింది. 1857 తర్వాత సాధ్యమైనంతగా భారతీయ సమాజాన్ని మతాలు, కులాలు, జాతులు, స్థాయులుగా వర్గీకరించి... వాటిని విభజించటంపై దృష్టిసారించింది బ్రిటిష్ ప్రభుత్వం.
నేరాలూ వారసత్వంగానే అంటూ...
ఎలాంటి స్థిరమైన పనులు చేయనివారిని, తమ యూరోపియన్ దృష్టిలో దేశదిమ్మరులుగా భావించిన వారిని, తమకు అర్థంగాని సంచార జాతులతో పాటు అనేక ఆదివాసీ తెగలను నేర జాతులు, కులాలుగా వర్గీకరించింది. 1871లో ఈ మేరకు నేరజాతుల చట్టం(Criminal tribes act) ప్రవేశపెట్టినప్పుడు... "భారత సమాజంలో చాలామంది చేనేత పనులను, వ్యవసాయ, వడ్రంగి పనులను వంశపారంపర్యంగా చేస్తూ వస్తున్నారు. కాబట్టి కొన్ని జాతులు, కులాల్లోని వారు నేరాలను వారసత్వంగా, వృత్తిగా తీసుకొని ఉంటారు" అని బ్రిటిష్ ప్రభుత్వం సమర్థించుకుంది. చామర్లు, లోధీలు, గుజ్జార్లలాంటి అనేక శాఖలతో పాటు హిజ్రాలు, సాధుసంతులు, ఫకీర్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఒక్క బంగాల్‌లోనే 237 నేర జాతులుగా కులాలను ప్రకటించారు.