తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: ఓర్వలేక 'ఓడ'గొట్టారు!

వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలే కాదు.. బ్రిటిష్‌ రాజ్‌ కుప్పకూల్చిన భారత కీలక రంగాల్లో నౌక నిర్మాణం కూడా ఒకటి! నాణ్యతలో, నవ్యతలో యావత్‌ ప్రపంచంతో శభాష్‌ అన్పించుకున్న భారత ఓడలను చూసి ఓర్వలేక తెల్లవారు దొడ్డిదారిన ఓడించారు. పట్టుబట్టి మన ఈ పరిశ్రమ నోట మట్టికొట్టారు!

By

Published : Oct 6, 2021, 9:58 AM IST

azadi ka amrit mahotsav
ఆజాదీ కా అమృత్

మూడు దిక్కులా సముద్రాలున్న భారతావని అనాది నుంచీ వ్యాపార వాణిజ్యాలకు ఈ తీరాలను సమర్థంగా వాడుకుంటూ వస్తోంది. మౌర్యుల కాలం నుంచి మొఘలుల దాకా ఎప్పుడు చూసినా ప్రపంచంతో భారత్‌ సముద్ర వాణిజ్యం అలరారింది. అందుకు తగ్గట్లుగానే భారత్‌లో నౌకా నిర్మాణ రంగం వేళ్లూనుకుంది. పురాతన కాలం నుంచీ ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో తిరిగి రావటంతోపాటు.. సంవత్సరాల తరబడి మన్నికగా నిలవటం భారతీయ నౌకల ప్రత్యేకత! 100 నుంచి 700 మందిదాకా ప్రయాణం చేయగలిగి... వందేళ్లు అలుపెరగకుండా నిలిచేవిగా భారతీయ నౌకలకు పేరు! రోమన్ల నుంచి చైనీయుల దాకా అనేక మంది వీటి నిర్మాణ కౌశలం చూసి ఆశ్చర్యపోయేవారు. యురోపియన్లు కూడా భారతీయ ఓడల్లోనే వ్యాపారం చేసేవారు.

గొడవలు ధర్నాలు..

పదహారో శతాబ్దంనాటికే హిందూ మహాసముద్ర మార్గాలపై పట్టు సంపాదించటం మొదలెట్టింది బ్రిటన్‌! ఈ క్రమంలో నౌకారంగం కీలకంగా మారింది. సముద్ర మార్గాల్లో ఎక్కడ చూసినా భారత ఓడలే ఉండేవి. భారత్‌తో నాణ్యతలో, మన్నికలో, ధరలో ఏ విధంగానూ పోటీపడలేని బ్రిటిష్‌ నౌకా నిర్మాణ పారిశ్రామికవేత్తలు గొడవ పెట్టారు. తమ ఓడలు వ్యాపారంలో నిలిచేలా చట్టాలు తేవాలని ఒత్తిడి తెచ్చారు. థేమ్స్‌ నది వద్ద ధర్నాకు దిగారు. ఇంగ్లాండ్‌ నుంచి సరకు రవాణాకు భారత్‌లో తయారైన ఓడలను నిషేధించాలంటూ ఆందోళన చేశారు. దీంతో 1651లో బ్రిటన్‌ ఓ చట్టం చేసింది. దీనిప్రకారం బ్రిటన్‌కు, దాని వలస దేశాలకు భారతీయ ఓడల్లో సరకులు తీసుకొని రావటం నిషేధం! దీనికి విరుగుడుగా చాలామంది భారతీయ నౌక నిర్మాణదారులు తమ ఓడల్ని ఇతర దేశాలకు అమ్మేశారు. బ్రిటన్‌లో తయారయ్యే ఓడలకంటే భారత్‌లో తయారైనవి నాణ్యతలో, డిజైన్‌లో మెరుగ్గా ఉండటమే కాకుండా ధరా తక్కువ కావటంతో బాగానే అమ్ముడయ్యాయి. కానీ అప్పటికే భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన వేళ్లూనుకోవటంతో భారతీయ నౌకా నిర్మాణంపై పన్నులు భారీగా వడ్డించి.. నడ్డి విరిచారు. వీటికి తోడు బ్రిటన్‌లో తయారైన ఓడలు కాకుండా మరే నౌకలోనూ సరకులు రవాణా చేసినా రెట్టింపు సుంకాలు విధించారు. నౌకలు తయారయ్యే ప్రాంతాల్లోని వడ్రంగులు, కార్మికులపై ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ఓడనిర్మాణంలోగానీ, మరమ్మతుల్లోగానీ పాల్గొంటే జైలు, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలా... క్రమంగా భారత నౌకా నిర్మాణాన్ని కుదేలు చేసి... బ్రిటన్‌లో ఆధునిక మోటార్‌ ఓడల నిర్మాణాన్ని వేగవంతం చేసుకున్నారు. ఆధునికత లేక భారత నౌక నిర్మాణం వెనకబడిందని ప్రచారం చేశారు. 1860-1925 మధ్య భారత్‌లో సుమారు 40 కోట్ల రూపాయల పెట్టుబడితో 102 షిప్పింగ్‌ కంపెనీలుండేవి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మూతబడ్డాయి. భారత సముద్ర జలాల్లో క్రమంగా బ్రిటన్‌ ఓడలు లంగరు వేశాయి. "బ్రిటన్‌ షిప్పింగ్‌ను బతికించటానికి భారత షిప్పింగ్‌ను నాశనం చేశారు" అంటూ గాంధీజీ అభివర్ణించారు.

1781 నుంచి 1821లోపు ముంబయిలోని లోజీవాడియా కుటుంబం 355 ఓడల్ని ఈస్టిండియా కంపెనీకే నిర్మించి ఇచ్చింది. కేవలం సరకు రవాణాకే కాదు యుద్ధనౌకల్ని కూడా బ్రిటన్‌కు తయారు చేసి ఇచ్చిన ఘనత భారతీయులది. అలా ముంబయిలో తయారైన హెచ్‌ఎంఎస్‌ మిండెన్‌ అనే ఓడలో కూర్చొనే ఫ్రాన్సిస్‌ కీ అమెరికా జాతీయ గీతానికి సంగీతం సమకూర్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details