British discriminating Indian Soldiers: సామ్రాజ్యవాద కాంక్ష... ఐరోపాలో శత్రుత్వాలతో ప్రపంచ యుద్ధాల్లో దిగిన బ్రిటన్... తన తరఫున పోరాడేందుకు వలస రాజ్యాల్లోని వారిని దించింది. ఈ క్రమంలో వారికి బంగారు బాతులా కన్పించింది భారత్. 1914 నుంచి 1919 మధ్య 15 లక్షల మంది భారతీయులను మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పోరాడటానికి సైన్యంలో భర్తీ చేశారు. బ్రిటన్ పాలనలో ఉన్న మిగిలిన అన్ని దేశాలతో పోలిస్తే భారత భాగస్వామ్యమే ఎక్కువ. లక్షా 75వేల జంతువులను (గుర్రాలు తదితర) భారత్ నుంచి తీసుకెళ్లారు. భారత ఖజానా నుంచి దాదాపు 10 కోట్ల పౌండ్లను యుద్ధం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికిచ్చారు. కోట్ల విలువైన ఆహార ధాన్యాలు దీనికి అదనం.
Azadi ka Amrit Mahotsav Telugu:
భారతీయులను సైనికులుగా భర్తీ చేసుకోవటమే వివక్ష ఆధారంగా సాగేది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని వారిని సైన్యంలోకి ఆహ్వానించినా... ఉత్తర భారత్‌లోని వారికి అందులోనూ మళ్లీ పంజాబ్, బలూచిస్థాన్‌లాంటి ప్రాంతాల్లోని వారిని యుద్ధజాతులుగా వర్గీకరించి ప్రాధాన్యం ఇచ్చేవారు. వీరితో పాటు గూర్ఖాలు, దోగ్రాలకు కూడా. కారణం... వీరంతా తమలా చలిప్రాంతాల్లోంచి వచ్చారు కాబట్టి యుద్ధాలను తట్టుకునే వీరత్వం ఉన్నవారని బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధాంతీకరించింది. అదే సమయంలో భారతీయులకంటే బ్రిటిష్‌వారు సమర్థులైన యుద్ధవీరులని పదేపదే నూరిపోసేది. పని ఒకటే అయినా భారత సిపాయిలకు తెల్లవారికంటే తక్కువ జీతభత్యాలిచ్చేవారు. అంతేగాకుండా ర్యాంకులో తమకంటే ఎక్కువ హోదాగల భారతీయులకు ఆంగ్ల సైనికులు సెల్యూట్ చేసేవారు కాదు. యుద్ధ ప్రణాళికలు రచించే సమయంలో భారతీయులను ఉండనిచ్చేవారు కాదు.
British Rule in India: