ప్రపంచ యుద్ధాలతో నిజానికి భారత్‌కు నేరుగా ఎలాంటి సంబంధమూ లేదు. కానీ భారత్‌ను తన వలస రాజ్యంగా మలచుకున్న బ్రిటన్- భారతీయులను తమ ఆస్తిగా భావించింది. తాము యుద్ధం చేస్తే భారత్ కూడా చేస్తున్నట్లేనంది. ప్రత్యక్షంగా భారత్‌నూ ప్రపంచయుద్ధాల్లోకి లాగింది. లక్షల మంది మన సిపాయిలను తమ పక్షాన సమరబరిలో దించింది. భారత్‌తో ఎలాంటి విరోధం లేని వివిధ దేశాలతో, ఎన్నడూ కనీవినీ ఎరుగని ప్రాంతాల్లో భారతీయ సిపాయిలు బ్రిటన్ జెండాను నిలబెట్టడానికి పోరాడారు. అసువులు బాశారు. ఇదంతా ఒకెత్తయితే...
పదేళ్లపాట విషప్రయోగాలు..
తమను నమ్మి వచ్చిన భారతీయ సైనికులపై బ్రిటన్ పాల్పడిన దురాగతాల్లో అత్యంత హీనమైంది విష వాయువుల ప్రయోగం(Rawalpindi experiments). యుద్ధంలో ప్రత్యర్థులపై రసాయనాల వినియోగానికి సంబంధించి బ్రిటన్ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఇంగ్లాండ్‌లోని పోర్టన్‌డౌన్‌లో సైన్స్ పార్క్ బ్రిటన్ రక్షణ పరిశోధనల కేంద్రం ఉంది. ఇందులోని శాస్త్రవేత్తలు రెండో ప్రపంచ యుద్ధానికి 10 సంవత్సరాల ముందే అంటే 1930 దశకం ఆరంభంలో రావల్పిండిలోని (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)(Rawalpindi experiments) రహస్య సైనిక కేంద్రానికి వచ్చారు. దాదాపు పదేళ్లపాటు అక్కడ భారతీయ సైనికులపై విషరసాయనాలను ప్రయోగించారు. ఎంతమోతాదులో రసాయనాలను విడుదల చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో, ప్రత్యర్థిని చంపాలంటే ఎంత మోతాదు అవసరమో... వీరిపై పరీక్షించి చూశారు. లండన్ జాతీయ ఆర్కైవ్స్ ప్రకారం యుద్ధంలో జపాన్‌పై వాడేందుకు వీటిని పరీక్షించారు. అనేక మంది భారతీయ సిపాయిలను(Rawalpindi experiments) ఇందుకు వాడుకున్నారు.