తెలుగు మహిళకు అత్యున్నత అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన బ్రిగేడియర్ ఎస్వీ సరస్వతి.. (Brigadier S V Saraswati) కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డును (National Florence Nightingale Award 2020) స్వీకరించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఈ అవార్డును సరస్వతికి ప్రదానం చేశారు.
ఇది దేశంలోని నర్సులకు (Highest award for nurses) ఇచ్చే అత్యున్నత అవార్డు. తమ వృత్తిలో ప్రదర్శించిన నిబద్ధత, అంకితభావానికి మెచ్చి ఈ అవార్డును ఇస్తారు.
వేల ప్రాణాలు కాపాడి...
ప్రస్తుతం మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (Military Nursing Service) డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా బ్రిగేడియర్ సరస్వతి సేవలందిస్తున్నారు. 1983 డిసెంబర్ 28న మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో చేరారు సరస్వతి. మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించారు. ఆపరేషన్ థియేటర్ నర్సుగా పనిచేసి.. 3 వేలకు పైగా అత్యవసర సర్జరీలలో పాల్గొని అనేక ప్రాణాలను కాపాడారు. దీంతో పాటు అనేక మంది రోగులకు సేవలందించారు. ప్రజలకు, ఆపరేషన్ రూమ్ నర్సింగ్ ట్రైనీలకు శిక్షణ అందించారు. గుండెపోటు సర్జరీల కోసం డ్రేప్ కిట్లు, పేషెంట్ టీచింగ్ మెటీరియల్‌ను రూపొందించారు.