మద్యం కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు.. గొడవలు.. హత్యలు.. ఆర్థిక కష్టాలు ఇలా ఎన్నో..! అందుకే ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లా దేవ్‌ప్రయాగ్ గ్రామంలో పోలీసులు మద్యం అతివినియోగం తగ్గించడానికి వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. వివాహ వేడుకను మద్యం లేకుండా నిర్వహిస్తే.. వధువుకు రూ.10,001 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ నగదు రివార్డును ప్రభుత్వం కాదు.. స్థానిక పోలీసులే విరాళంగా తలా కొంత డబ్బు జమ చేసి ఇవ్వడం గమనార్హం. పోలీసుల నిర్ణయంపై అక్కడి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం లేకుండా పెళ్లి జరిగితే నగదు బహుమతి! - alcohol less marriage scheme
ఒకప్పుడు మద్యం లేకుండానే వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడు మద్యం లేకుండా ఏ వేడుకా జరగదు. ఈ పాశ్చత్య సంస్కృతి.. పట్టణాల నుంచి ఇప్పుడు గ్రామాలకు పాకింది. ఏ చిన్న వేడుకైనా మద్యం ఏరులై పారాల్సిందే.. దీంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడానికి ఉత్తరాఖండ్ పోలీసులు గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. అదేంటో మీరే చదవండి.
"ఒకప్పుడు రాష్ట్రంలోని గ్రామాల్లో జరిగే వేడుకల్లో మద్యం సేవించడం ఉండేది కాదు.. కానీ, పట్టణీకరణ.. పాశ్చత్య సంస్కృతి ఇక్కడికి కూడా పాకాయి. వేడుకల్లో మద్యం సేవించడం ఒక సంస్కృతిలా మారిపోయింది. కొంతమంది బాగా తాగేసి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు, ఇతరులతో గొడవలకు కారణమవుతున్నారు. మద్యం మైకంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడి ఉన్న పేదలు వివాహ వేడుకల్లో ఇతరులకు తీసుపోకుండా ఉండాలని తలకి మించిన భారాన్ని భరిస్తూ మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అప్పులపాలు అవుతున్నారు. వీటిని తగ్గించడానికే ఈ పథకం తీసుకొచ్చాం. వివాహ వేడుకను మద్యం లేకుండా జరిపిస్తే రూ.10,001 నగదు బహుమతిని వధువుకు అందజేస్తాం" అని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:'పట్టు'దలతో మహిళల సిరుల పంట