ఈ మధ్య రకరకాల కారణాలతో ఎన్నో పెళ్లిళ్లు మండపంలోనే ఆగిపోతున్నాయి. అదనపు కట్నం, ప్రేమ వ్యవహారాలు భయటపడడం వంటి కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోవడం సర్వసాధారణమైంది. అయితే కొందరు వధూవరులు మాత్రం చిన్న చిన్న కారణాలతోనే పెళ్లికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. వధువుకు జుట్టు తక్కువగా ఉందన్న కారణంతో.. ముహుర్తానికి కొన్ని క్షణాల ముందు పెళ్లికి నిరాకరించాడు. అయితే వధువు బంధువులు మాత్రం.. వారు అడిగిన అదనపు కట్నం ఇవ్వనందునే పెళ్లికి నో చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జుట్టు తక్కువగా ఉందని పెళ్లికి నో..! వధువుకు షాక్ ఇచ్చిన వరుడు - ఉత్తర్‌ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. వరుడు పెళ్లికి నిరాకరించాడు. కాబోయే భార్యకు జుట్టు తక్కువగా ఉందనే కారణంతో పెళ్లికి నో చెప్పాడు. వధువు కుటుంబసభ్యులు మాత్రం.. అదనపు కట్నం కోసమే వరుడు పెళ్లికి నో చెప్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అయోధ్యలోని బికాపుర్ ప్రాంతంలో.. మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా.. వధువుకు జుట్టు తక్కువగా ఉందని వరుడు పెళ్లికి నిరాకరించాడు. జమోలి నుంచి బికాపుర్ గ్రామానికి ఊరేగింపు వచ్చింది. అయితే అదే సమయంలో వరుడికి తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తలపై జుట్టు తక్కువగా ఉందన్న విషయం తెలిసింది. ఆగ్రహానికి గురైన వరుడు.. వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. వధువు తలపై జుట్టు తక్కువగా ఉండటం చూసిన వరుడు.. పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. రాత్రంతా ఇరు కుటుంబ సభ్యులు పంచాయితీ జరిపినా సరే.. పెళ్లికొడుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోనని చెప్పేశాడు.
పెళ్లికి ముందే అన్ని విషయాలు వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు వివరించినట్లు వధువు సోదరి వెల్లడించింది. వారు మరింత కట్నం కోసం డిమాండ్ చేశారని.. అందుకు తాము ఓప్పుకోకపోవడం వల్లే వివాహానికి నో చెప్పిన్నట్లు వధువు బంధువులు ఆరోపించారు. ఈ విషయంలో రాత్రంతా పంచాయితీ జరిగినా ఓ కొలిక్కి రాకపోవడం వల్ల ఇరువర్గాలు బికాపుర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. అదనపు కట్నం కోసమే వరుడి కుటుంబం పెళ్లికి నిరాకరించిందని.. వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వరుడు, అతడి తండ్రి సహా మరో 9 మంది బంధువులపై కేసు నమెదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.