పెళ్లికి అంతా సిద్ధం అయింది. పందిర్లు వేశారు. బంధువులంతా వచ్చారు. బ్యాండ్ బాజాలు మోగుతున్నాయి. భోజనాలు సైతం ప్రారంభమయ్యాయి. వధూవరులు ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కారు. దండలు మార్చుకునే సమయంలో... 'నాకీ పెళ్లి వద్దు బాబోయ్' అంటూ వధువు బాంబు పేల్చింది. వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు.
'నల్లగా ఉన్నాడు నాకీ పెళ్లి వద్దు'.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు - వరుడుని చూసి పెళ్లికి నిరాకరించిన వధువు
వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లికి నిరాకరించింది ఓ వధువు. దండలు మార్చుకునే సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఉత్తర్ప్రదేశ్లో ఈ ఘటన జరిగింది.
ఉత్తర్ప్రదేశ్ మహరాజ్గంజ్ జిల్లా పనియార పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 8న ఈ పెళ్లి కావల్సి ఉండగా వధువు నిరాకరించడం వల్ల ఆగిపోయింది. జయమాలలు వేసుకునే సమయంలో వరుడిని చూసిన పెళ్లి కూతురు.. వివాహానికి ససేమిరా అంది. వెంటనే పెళ్లి మండపం నుంచి కిందకు వచ్చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి వాళ్లు ఎంత చెప్పిన ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక పెళ్లిని ఆపేశారు పెద్దలు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది.