తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ తాగుబోతుతో పెళ్లి వద్దు!'.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు - వారణాసిలో పెళ్లికి తాగి వచ్చిన వరుడు

వరుడికి పెళ్లి మండపంలోనే షాకిచ్చింది ఓ వధువు. వివాహ సమయానికి వరుడు మద్యం తాగి ఉండడాన్ని గమనించి పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినకపోగా.. చివరకు పెళ్లినే క్యాన్సిల్​ చేసుకుంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Bride Breaks Marriage In UP Varanasi
పెళ్లికి తాగి వచ్చిన వరుడు.. నాకీ పెళ్లొద్దంటూ మొండికేసిన వధువు.. చివరకు మరి పెళ్లైందా.. లేదా..?

By

Published : May 22, 2023, 10:37 PM IST

పెళ్లి రోజే వరుడు చేసిన పనికి ఓ వధువు అతడికి గట్టి షాకిచ్చింది. పెళ్లి మండపంలోకి మద్యం సేవించి వచ్చాడనే కారణంతో ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా నాకీ పెళ్లి వద్దంటూ మొండికేసింది. దీంతో చేసేదేమిలేక వరుడు అతడి కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి జిల్లాలో జరిగిందీ ఘటన.

మెడలో దండ వేస్తుండగా..
చౌబేపుర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. అయితే సాయంత్రం ఊరేగింపుగా ముందుగా బుక్​ చేసుకున్న ఓ ఖరీదైన ఫంక్షన్​ హాల్​కు వరుడు అతడి బంధువులు చేరుకున్నారు. ముహూర్తం సమీపిస్తున్న సమయంలో వరుడు తన స్నేహితులతో కలిసి పెళ్లి మండపంలోకి వెళ్లాడు. కాసేపటికే వధువు కూడా తన స్నేహితులతో కలిసి వేదికపైకి వచ్చింది.

కాసేపట్లో వధువువరులిద్దరూ పూలదండలు మార్చుకుంటారనే సమయానికి వరుడి ఫ్రెండ్స్​.. పెళ్లికుమార్తె స్నేహితులను చూసి కేకలు వేశారు. అప్పటికే వారు మద్యం సేవించి ఉండడం వల్ల స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వరుడి మెడలో వధువు దండ వేస్తుండగా వరుడు కూడా మద్యం సేవించి ఉన్నాడని గమనించింది నవవధువు. వెంటనే వేదికపై నుంచి దిగి ఫంక్షన్ హాల్​లోని ఓ గదిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న అతిథులంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. పెళ్లికొచ్చిన కొందరు మహిళలు వధువు ఉన్న గదిలోకి వెళ్లి ఆరాతీయగా.. ఆ తాగుబోతును తాను పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పేసింది.

వరుడి సోదరుడు వేడుకున్నా వినలేదు!
పెళ్లి పీటల దాకా వచ్చిన వివాహాన్ని అలా రద్దు చేసుకోవద్దంటూ.. వివాహానికి ఒప్పుకోవాలంటూ కుటుంబపెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. అతడిని పెళ్లి చేసుకునేందుకు విముఖత చూపించింది. ఈ క్రమంలో వరుడి సోదరుడు వధువును పెళ్లికి ఒప్పుకోవాలంటూ బతిమిలాడాడు. అయినా వధువు మొండిగా ప్రవర్తించి పెళ్లికి నో చెప్పింది. కనీసం పోలీసులతోనైనా కౌన్సెలింగ్​ ఇప్పించి పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వధువు తగ్గకపోగా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలపాయి. పెళ్లి ఏర్పాట్లకు అయిన ఖర్చులు, కట్నకానుకలు తిరిగి ఇచ్చేందుకు రెండు కుటుంబాల మధ్య రాజీ కుదరింది. దీంతో పెళ్లికి వచ్చిన వారందరితో పాటు వరుడు, అతడి కుటుంబ సభ్యులు నిరాశగా వెనుదిరిగారు.

పెళ్లి రద్దవడం వల్ల వెనుదిరుగుతున్న బంధువులు

అప్పటికే వద్దంది.. మళ్లీ ఒప్పుకుంది!
అయితే పెళ్లి నిశ్చయమైన తర్వాత వధూవరులిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారని కుటుంబసభ్యులు తెలిపారు. రెండు వారాల క్రితమే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో వరుడు మద్యం మత్తులో వధువును దుర్భాషలాడాడని చెప్పారు. ఆ సమయంలోనే యువతి పెళ్లికి నిరాకరించింది. ఇది కాస్త పెద్దల దృష్టికి వెళ్లడం వల్ల వరుడు ఆ యువతికి క్షమాపణలు చెప్పడం వల్ల ఆమె పెళ్లికి అంగీకరించింది. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి మండపంలోకే మందు తాగి వచ్చిన వరుడికి యువతి సరైన గుణపాఠం చెప్పిందని పెళ్లికి వచ్చిన బంధువులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details