సమాజంలో ఒకప్పుడు గోవును చాలా పవిత్రంగా పూజించేవారు. కానీ ఇప్పుడు ఇళ్లలో గోవులు కూడా కనబడని స్థితికి చేరుకుంది. సమాజంలో గోమాత పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి పురాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గోమాత సన్నిధిలో పెళ్లిచేసుకున్నారు వధూవరులు. అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోమాత సాక్షిగా వేదమంత్రాలు, మహర్షులు, సాధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ వింత వివాహం జరిగింది.
గ్వాలియర్‌లోని డీఆర్‌పీ లైన్‌లో నివసిస్తున్న రంజన శర్మకు, ఆగ్రా నివాసి యతేంద్ర శర్మకు పెద్దలు పెళ్లిని నిర్ణయించారు. గోమాత సన్నిధిలో ఈ పెళ్లి జరగాలని రంజన కుటుంబీకులు కోరగా.. వరుడు కుటుంబం సంతోషంగా దానికి ఒప్పుకుంది. దాంతో పురాతన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రంజన,యతేంద్ర.
సాధువుల సన్నిధిలో గోపూజ
గోమాత రక్షణపై సమాజానికి అవగాహన కల్పించేందుకు..పెళ్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రంజన సోదరుడు అభిషేక్ శర్మ తెలిపారు. ముందుగా వధూవరులు.. సాధువుల సమక్షంలో గోవుకు ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు వేద మంత్రాల నడుమ వారి కుటుంబ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. ఈ సందర్భంగా రిషభదేవ్ ఆనంద్ మహరాజ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.