Bribe For Corona Treatment: కరోనా రెండో దశలో భారత్‌లో మృత్యుఘోష వినిపించింది. రోజుకు వేల మంది మరణించారు. ఆక్సిజన్, ఔషధాలు లేక ప్రజలు నరకం అనుభవించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలోనూ దేశంలో అవినీతి జరిగిందని సామాజిక మాధ్యమం లోకల్ సర్కిల్స్ సర్వే ద్వారా బహిర్గతమైంది. సెకండ్ వేవ్‌లో కరోనా చికిత్స పొందిన ప్రతి 10మంది పౌరుల్లో నలుగురు ఆరోగ్య సిబ్బందికి, ఆస్పత్రి యాజమాన్యానికి లంచాలు ఇచ్చినట్లు తేలింది. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్, ఔషధాలు వంటి కనీస వసతుల కోసం ప్రజలు ముడుపులు చెల్లించినట్లు వెల్లడైంది.
చికిత్స అనంతరం ఆస్పత్రి వేసిన బిల్లును తగ్గించేందుకు 9శాతం మంది లంచం ఇచ్చినట్లు సర్వే స్పష్టం చేసింది. ఐసీయూలో ఉన్న తమ వారి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు, వారిని సందర్శించేందుకు కూడా ప్రజలు ఇదే సంఖ్యలో డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. ఆస్పత్రి పారిపాలనా విభాగం, ఇతర సిబ్బందికి ఈ ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది.
Corona second wave india
సెకండ్ వేవ్‌లో లంచాలు తీసుకుని అత్యధికంగా లబ్ధి పొందింది మాత్రం ఆస్పత్రుల్లోని వార్డు బాయ్స్ అని లోకల్ సర్కిల్స్ నివేదిక తేటతెల్లం చేసింది.
సర్వేలోని ఇతర వివరాలు..
సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కరు కూడా డాక్టర్‌కు గానీ, నర్సుకు గానీ లంచం ఇచ్చినట్లు చెప్పలేదు. ఆస్పత్రులలో అవినీతి జరగకుండా ప్రభుత్వమే కఠిన నిబంధనలు తీసుకురావాలని అప్పడే డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని వారు అభిప్రాయపడ్డారు.