Vastu About Breeding Rabbits at Home : ప్రస్తుతం చాలామంది జీవితాల్లో పెంపుడు జంతువులు భాగమయ్యాయి. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో కుక్కలతోపాటు పలురకాల పెట్స్(జంతువులు/పక్షులు)ను పెంచుతుంటారు. ఈ పెంపుడు జంతువుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తమతోపాటు బయటకు తీసుకువెళ్లడం.. వాటితో ఆడుకోవడం వంటి పనుల ద్వారా.. జనాల్లో ఒత్తిడి మాయమవుతుందట. తద్వారా మనుషుల ఆరోగ్యం మెరుగుపడుతుందట. కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాకుండా.. వీటి పెంపకంతో ఒంటరితనం, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయని అధ్యయనాలు తేల్చిచెప్పాయి.
అయితే.. పెంపుడు జంతువులు అనగానే చాలా మంది ఇళ్లలో.. కుక్కలు, పిల్లులు, పక్షులు.. వంటివే కనిపిస్తాయి. కానీ.. కొందరి ఇళ్లలో వేరే జంతువులు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో కుందేలు ఒకటి. చూడ్డానికి చాలా ముద్దుగా ఉండడం.. మృదువుగా ఉండడం వంటి కారణాలతో.. వీటితో ఆడుకునేందుకు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దీంతో.. పలు ఇళ్లలో వీటిన పెంచుతుంటారు. మరి, ఇంతకీ.. ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? పెంచుకుంటే ఏమవుతుంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మన దేశంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. దేవుడిని నమ్మేవారంతా వాస్తును విశ్వసిస్తారు. ఈ వాస్తు శాస్త్రం(Vastu Shastra) ప్రకారం.. ప్రతి జంతువుకూ కొన్ని శక్తులు ముడిపడి ఉంటాయట. ఆ శక్తులు ఇంటి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఈ క్రమంలో.. ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా? అంటే.. వాటిని ఇంట్లో పెంచడం సరికాదని అంటున్నారు! ఎందుకు పెంచకూడదో వివరణ కూడా ఇస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం మనుషులు నివసించే ఇంటిని.. 'మనుష్యాలయం' అని అంటారట. అంటే.. ఇది మనుషులు నివసించే చోటు అన్నమాట. ఇదేవిధంగా.. రకరకాల జంతువులు అవి నివసించడానికి ప్రత్యేకమైన ప్రాంతాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా ఒక ఇల్లు కట్టినప్పుడు ఇంటి ప్రాగణంలో చెట్లు, లాన్ వంటివి ఏర్పాటు చేసుకున్న తర్వాత.. కొన్ని జీవులు వాటంతట అవే వచ్చి వాటిపై నివసిస్తుంటాయి. ఇంట్లో కొన్ని పిట్టలు గూళ్లు కూడా కట్టుకుంటాయి. ఇలా వాటంతటవే వచ్చి నివసిస్తే పర్వాలేదు.. కానీ.. స్వేచ్ఛగా తిరగాల్సిన జంతువులను ఇంట్లో బంధించి పెంచడం మాత్రం సరికాదట.