Breath Analyser Test DGCA : దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం కారణంగా విమానయానం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బందికి శ్వాస పరీక్షలు (బ్రీత్ అనలైజర్) పునరుద్ధరించింది. అక్టోబరు 15 నుంచి పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సహా ప్రతి ఉద్యోగికి ఈ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
విమాన సిబ్బంది మద్యం సేవించారా లేదా అన్నది తెలుసుకునేందుకు రోజువారీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే కొవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత ఈ నిబంధనపై కొన్ని పరిమితులు విధించారు. ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బందిలో 50శాతం మందికి మాత్రమే ఈ శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 2021 మే నెలలో దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు.. గంటకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆదేశాలను న్యాయస్థానం ఇటీవల సవరించింది. దీంతో పాటు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడం, ప్రయాణికుల రద్దీ పెరగడంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు డీజీసీఏ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఆదేశాల ప్రకారం.. ప్రతి విమాన, క్యాబిన్ సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. పెద్ద, బహిరంగ ప్రదేశంలో ఈ పరీక్షలు నిర్వహించాలని, అక్కడ సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ పరీక్షలు నిర్వహించే వైద్యులు, నర్సులు.. ముందుగా విమాన సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షించాలని తెలిపింది. ఒకవేళ ఏ సిబ్బందికైనా కొవిడ్ పాజిటివ్‌గా తేలితే, ఆ వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించి విధుల నుంచి సెలవు ఇవ్వాలని సూచించింది.