తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా తీసుకున్న తల్లులు.. పిల్లలకు పాలివ్వొచ్చు' - ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌

టీకా తీసుకున్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వటం ఆపొద్దని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత విరామం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒకటి రెండు రోజులు ఆగాల్సిన అవసరమే లేదని చెప్పారు.

vaccine
వ్యాక్సినేషన్

By

Published : May 23, 2021, 6:51 AM IST

పిల్లలకు పాలిచ్చే తల్లులు కొవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత విరామం ఇవ్వాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం ఆపొద్దని.. అలా తామెక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ఒకటి రెండు రోజులు ఆగాల్సిన అవసరమే లేదన్నారు. ఆయన శనివారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

పెద్దల తరహాలోనే పిల్లలకూ కొవిడ్‌ సోకేందుకు అవకాశాలున్నాయని, అయితే వారిలో తీవ్రరూపం దాల్చే అవకాశాలు తక్కువేనని వీకే పాల్‌ పునరుద్ఘాటించారు. పిల్లల్లో లక్షణాలు కనిపించకపోయినా వారు వైరస్‌ను వ్యాప్తి చేయగలుగుతారని చెప్పారు.

కరోనా లేనివారికీ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు

కరోనా రాకముందు నుంచే బ్లాక్‌ ఫంగస్‌ ఉందని, అందువల్ల కొవిడ్‌ సోకని రోగుల్లోనూ, నియంత్రించలేని స్థాయిలో మధుమేహం ఉన్న వారికి ఇది వచ్చే అవకాశం ఉందని వీకే పాల్‌ తెలిపారు. మధుమేహం అదుపులో లేనివారికి, ఇంకేదైనా అనారోగ్య సమస్య తోడైతే ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. దీని గురించి ఇదివరకే అందరికీ తెలుసని, అది అరుదుగా వచ్చేదన్నారు. ఇప్పటిలా తీవ్రంగా ఉండేది కాదన్నారు. ఇప్పుడు కొవిడ్‌ మనిషి శరీరంలోని చాలా భాగాలపై ప్రభావం చూపుతోందని, అలాంటివారికి స్టెరాయిడ్స్‌ ఇచ్చినప్పుడు రోగ నిరోధకశక్తి తగ్గుతుందని, దానివల్లే ఈ సమస్య వస్తుందని చెప్పారు.

మందుల లభ్యత పెంపు

బ్లాక్‌ఫంగస్‌ నివారణ కోసం మందుల లభ్యతను పెంచుతున్నట్లు చెప్పారు. దీన్నుంచి తప్పించుకోవాలంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలన్నారు. కొవిడ్‌ రోగులకు నిర్ణీత సమయం కంటే ముందు స్టెరాయిడ్స్‌ ఇవ్వడం, లేదంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వడంవల్లే ఈ సమస్య వస్తోందన్నారు. రెండు డోసుల్లో రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇవ్వొచ్చని, అయితే దానిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని పాల్‌ చెప్పారు. శాస్త్రీయంగా ఇందుకు అవకాశం ఉన్నప్పటికీ, బలమైన ఆధారాలు దొరకలేదని, అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు.

'వ్యాక్సిన్‌ పాస్ట్‌పోర్ట్‌' విషయమై చర్చలు కొనసాగుతున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి వివిధ దేశాల్లోకి అనుమతించే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన స్పందించారు. దీనిపై డబ్ల్యూహెచ్‌వోలో ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిని పూర్తి నెగెటివ్‌గా భావించి దేశంలోకి అనుమతించాలా? లేదా? అన్నదానిపై చర్చలు నడుస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చినవారినే అనుమతిస్తున్నారని, వ్యాక్సినేషన్‌ అయినవారినీ అనుమతించాలన్న దానిపై డబ్ల్యూహెచ్‌వోలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే చర్యలు చేపడతారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :నేడు కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details