తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Breakthrough Infections: కలవరపెడుతున్న 'బ్రేక్‌త్రూ' ఇన్‌ఫెక్షన్‌లు!

కొవిడ్​ టీకా(Covid vaccine) తీసుకున్న తర్వాత వైరస్​ బారినపడుతున్న కేసుల సంఖ్య (Breakthrough Infections) భారీగా పెరుగుతోంది. భారత్​లో ఇప్పటికే 2.6 లక్షల మందికి సోకింది. అందులో కేరళలోనే అత్యధిక కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. రెండు డోసులు తీసుకున్న వారిలో బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని కేంద్రం తెలిపింది.

breakthrough-infections
బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు

By

Published : Aug 20, 2021, 10:01 AM IST

కరోనా వ్యాక్సిన్‌(Corona vaccine) తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడుతున్న (Breakthrough Infections) కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. భారత్‌లోనూ ఇప్పటివరకు దాదాపు 2.6లక్షల మందిలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఇటువంటి కేసులు అధికంగా ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ అక్కడ కొత్త వేరియంట్‌ వెలుగు చూసిన దాఖలాలు లేవని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేలినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకున్న వారిలో బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 56కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిలో 44కోట్ల మందికి తొలి డోసు అందించగా.. 12 కోట్ల మందికి రెండు మోతాదులు పూర్తయ్యాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడే అవకాశాలు, రీ-ఇన్‌ఫెక్షన్‌, వైరస్‌ ఉత్పరివర్తనాలతో పాటు కొత్త వేరియంట్లపై కేంద్ర ఆరోగ్యశాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమ్ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (INSACOG) ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకున్న మొత్తం జనాభాలో తొలి డోసు తీసుకున్న లక్షా 70వేల మందిలో కరోనా వైరస్‌ బయటపడినట్లు గుర్తించింది. ఇక రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 87వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఇలా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు పెరగడం కలవరపెట్టే అంశమే అయినప్పటికీ.. ప్రమాదం ఏమీ ఉండదని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు.

కేరళలోనే అధికం..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(Corona virus) తీవ్రత కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం వైరస్‌ సంక్రమణ నియంత్రణలోకి రావడం లేదు. ఓవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగానే సాగుతున్నా.. టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడుతున్న కేసుల సంఖ్య కూడా పెfరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ రెండు డోసుల్లో టీకా తీసుకున్న తర్వాత 40వేల మందిలో వైరస్‌ బయటపడినట్లు సమాచారం. అటు తొలిడోసు 100శాతం పూర్తి చేసుకున్న వయనాడ్ జిల్లాలోనూ బ్రేక్‌ త్రూ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉద్ధృతికి కొత్త వేరియంట్ ఏదైనా కారణమా? అని వస్తోన్న అనుమానాలను కేంద్ర ఆరోగ్యశాఖ తోసిపుచ్చింది. కేరళలో 200 పాజిటివ్‌ కేసులకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా కొత్త వేరియంట్‌ దాఖలాలు కనిపించలేదని స్పష్టం చేసింది.

ఆస్పత్రి చేరికలు, మరణాలు తక్కువే..

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలో బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్‌లపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్‌ సోకినా.. ఆస్పత్రి చేరికలు, మరణాల ముప్పు ఉండవని స్పష్టం చేసింది. వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో వ్యాక్సిన్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే తప్ప..ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:Vaccination: గర్భిణులకు టీకా.. దుష్ప్రభావాలు ఉన్నాయా?

ABOUT THE AUTHOR

...view details