దేశంలో కరోనా వ్యాక్సిన్(Corona vaccine) తీసుకున్న తర్వాత వైరస్ బారినపడుతున్న (Breakthrough Infections) కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇందులో ఎక్కువ శాతం కేసులు.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న డెల్టా వేరియంట్(delta variant in india)కు చెందినవేనని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీల కన్సార్టియం(ఐఎన్ఎస్ఏసీఓజీ-ఇన్సాకాగ్) వెల్లడించింది.
భారత్‌లో కొవిడ్ కేసులు తగ్గకపోవడానికి, వైరస్ వ్యాప్తిలో టీకాల సామర్థ్యం అనుకున్న మేర లేకపోవడానికి గల కారణం కూడా డెల్టా వేరియెంటేనని స్పష్టం చేసింది ఇన్సాకాగ్. అయితే వ్యాధి తీవ్రత, మరణ ముప్పును తగ్గించడంలో మాత్రం టీకాలు మంచి ఫలితాల్ని ఇస్తున్నట్టు తేల్చి చెప్పింది. వైరస్ కట్టడికి ప్రజారోగ్య చర్యలు ముమ్మరం చేయడం అత్యంత కీలకమని పేర్కొంది.
ఆందోళనకర రీతిలో ఉన్న వేరియంట్లకు సంబంధించి 30,230 నమూనాలను పరీక్షించింగా.. వాటిల్లో 20,324 డెల్టా(delta variant cases in india)కు చెందినవేనని తేలినట్టు ఇన్సాకాగ్ పేర్కొంది.
"బ్రేక్‌త్రూ కేసులకు ఏదైనా కొత్త వేరియంట్ కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి, దేశంలోని బ్రేక్‌త్రూ కేసుల సీక్వెన్సింగ్‌లో డెల్టా కేసులే ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయి. కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే, వాటిని కనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి."