Breach in PM Modis security: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా ప్యానెల్.. శుక్రవారమే దర్యాప్తును ప్రారంభించింది. రాష్ట్రంలో పర్యటించిన కమిటీ.. పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ సహా మొత్తం 10 మందికిపైగా పోలీస్ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది.
- ఫిరోజ్‌పుర్- మోగా హైవే ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు కమిటీ సభ్యులు.
- సుమారు కిలోమీటర్ దూరం నడిచి.. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
- గంటసేపటి తర్వాత సమీపంలోని ఫిరోజ్‌పుర్ బీఎస్ఎఫ్ కార్యాలయానికి చేరుకొని.. అక్కడి అధికారులతో మోదీ భద్రతా లోపం ఘటనపై చర్చించారు.
- పంజాబ్ పర్యటనలో బుధవారం.. ప్రధాని వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకుని అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు.
- ఆ వెంటనే పోలీసులకు సమన్లు జారీ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆ మార్గం క్లియరెన్స్ బాధ్యతలు చూసినవారిలో డీజీపీ, ఎస్ఎస్పీలపై ప్రశ్నల సంధించి.. అన్ని విధాలా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
కేబినెట్ సెక్రెటేరియట్ కార్యదర్శి సుధీర్ కుమార్ సక్సేనా ఈ కేంద్ర కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఐజీ ఎస్ సురేశ్‌లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా నివేదిక అందించాలని హోంశాఖ ఈ కమిటీని ఆదేశించింది.
పోలీసులపై చర్యలు!
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) చట్టం కింద.. పంజాబ్ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
ఎస్పీజీ చట్టంలోని సెక్షన్ 14.. ప్రధానమంత్రి ఎటైనా వెళ్లిన సమయంలో ఎస్పీజీకి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకారం, సమన్వయం సహా అన్నింటికీ బాధ్యత వహించాలని చెబుతోంది.
కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీసులు..
పంజాబ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీసులు పంపింది. వీరిలో భఠిండా ఎస్పీ అజయ్ మలుజా సహా ప్రధాని పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు ఉన్నారు.