తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బొగ్గు గనిలో భర్త గల్లంతు.. బెదిరించినా, డబ్బులిచ్చినా నో.. రెండు నెలలుగా భార్య పోరాటం

భర్త కోసం రెండు నెలల పాటు పోరాడింది ఓ భార్య. బొగ్గు గని తవ్వుతు గల్లంతైన భర్త ఆచూకీ కావాలని తీవ్రంగా శ్రమించింది. పోలీసులు సహకరించకపోయినా.. మాఫియా భయపెట్టినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. భర్త కోసం రాష్ట్ర డీజీపీని ఆశ్రయించింది.

brave-village-women-of-assam-women-fight-for-missing-husband-lost-in-coal-mines-wife-fights
బొగ్గు గనిలో తప్పిపోయిన భర్త కోసం భార్య పోరాటం

By

Published : Apr 8, 2023, 6:49 AM IST

బొగ్గు గని తవ్వుతు గల్లంతైన భర్త కోసం.. ఓ మహిళ రెండు నెలల పాటు అలుపెరగని పోరాటం చేసింది. మైనింగ్​ మాఫియా అక్రమ బొగ్గుగనుల తవ్వకాల్లో..​ బలైన భర్త జాడ కోసం ఏకంగా రాష్ట్ర డీజీపీనే కలిసింది. మైనింగ్​ మాఫియా బెదిరించినా.. రూ.5 లక్షల ఆశ జూపిన పట్టువిడవలేదు. స్థానిక పోలీసులు సహకారం అందించకున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు బొగ్గు గనుల కింద కుళ్లిపోయిన.. తన భర్త శవాన్ని చూసి బోరున విలపించింది. అసోంలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..
ఆ మహిళ పేరు ఊర్వశి మోరన్. భర్త ప్రాంజల్ మోరన్. వీరిద్దరు తిన్​సుకియా జిల్లాలోని షుకాని గ్రామానికి చెందిన వారు. జనవరి 12న లిడులోని మైనింగ్​ మాఫియా చేపట్టిన బొగ్గు తవ్వకాలలో.. ప్రాంజల్ పనిచేస్తు గల్లంతయ్యాడు. అతడి జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో మార్చి 4న.. లిడు పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. కానీ మాఫియా గ్యాంగ్​ ఒత్తిడితో వాళ్ల ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. ఊర్వశికి సైతం రూ.5 లక్షలు ఇవ్వజూపింది మైనింగ్​ మాఫియా గ్యాంగ్​. కానీ ఊర్వశి ఆ డబ్బును తీసుకోలేదు. తనకు తన భర్త కావాలని డిమాండ్​ చేసింది.

మృతుడు ప్రాంజల్​

650 కిలోమీటర్ల దూరమున్న గుహవటికి వెళ్లి డీజీపీని కలిసిన ఊర్వశి..
స్థానిక పోలీసులు ఎంతకీ స్పందించకపోవడం వల్ల.. 650 కిలోమీటర్ల దూరమున్న గుహవటికి వెళ్లాలని నిర్ణయించుకుంది ఊర్వశి. వెంటనే తన బిడ్డను చంకనెత్తుకుని గుహవటికి చేరుకుంది. రాష్ట్ర డీఐజీ.. జీపీ సింగ్​ను తన కార్యాలయంలో కలిసింది. ఘటన మొత్తాన్ని ఆయనకు వివరించింది. ఎలాగైన తన భర్తను వెతకాలని ప్రాధేయపడింది. దీనిపై స్పందించిన డీఐజీ.. ఊర్వశి భర్త ప్రాంజల్​ను వెతికిపెడతామని ఆమెకు హామీ ఇచ్చారు. దక్షిణ అసోం ఇన్‌ఛార్జ్ ఐజీపీ జిత్మల్ డేల్‌కు దర్యాప్తు బాధ్యతను అప్పగించారు.

ప్రాంజల్​ భార్య ఊర్వశి

బొగ్గు గనుల కింద కుళ్లిపోయిన స్థితిలో ప్రాంజల్​ మృతదేహం..
ప్రాంజల్​ తప్పిపోయిన బొగ్గుగని ప్రాంతానికి.. సోమవారం తన టీంతో వెళ్లాడు ఐజీపీ జిత్మల్ డేల్‌. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం బొగ్గు గనుల కింద ​కుళ్లిపోయిన స్థితిలో ప్రాంజల్​ మృతదేహాన్ని గుర్తించారు. భర్త చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రాంజల్​ భార్య, అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details