Brain Dead Person Organs Donation :బ్రెయిన్ డెడ్‌కు గురైన భర్త అవయవాలు దానం చేసితన పెద్దమనసును చాటుకున్నారు తమిళనాడుకు చెందిన ఓ మహిళ. 36 ఏళ్ల తన భర్త అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసి నలుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడారు.
ఇదీ విషయం..
కన్యాకుమారి జిల్లా విలవంకోడ్కు చెందిన సెల్విన్ శేఖర్ ఓ అసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా స్టాఫ్ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, నవంబర్ 21న సెల్విన్ శేఖర్ భరించలేని తలనొప్పితో బాధపడుతూ కన్యాకుమారిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అతడిని పరిశీలించిన వైద్యులు.. మెదడులో రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం కేరళ తిరువనంతపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 24న బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. వృత్తిరీత్యా నర్స్ అయిన అతడి భార్య.. అవయవదానానికి స్వచ్చందంగా ముందుకు వచ్చింది.
మృతుడి భార్య అంగీకారం అనంతరం అతడి అవయవాలను తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసారు. కొచ్చిలో గుండెమార్పిడి అవసరమైన రోగి కోసం హృదయాన్ని తరలించేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గుండెను తరలించడానికి మంత్రి పి.రాజీవ్‌ను సంప్రదించి ప్రభుత్వ హెలికాఫ్టర్‌ను తీసుకుని తిరువనంతపురం నుంచి కొచ్చికి సెల్విన్ గుండెను ఎయిర్ అంబులెన్సులో తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్ హెలీప్యాడ్‌లో దిగిన వెంటనే.. లీసీ అసుపత్రిలో చికిత్స పొందుతున్న కాయంకులానికి చెందిన హరినారాయణ్(16)కు సెల్విన్ గుండెను అమర్చారు. సెల్విన్ శరీరంలోని ఓ కిడ్నీని తిరువనంతపురంలోని ఓ రోగికి అమర్చనున్నారు. సెల్విన్ నేత్రాలను తిరువనంతపురం కంటి ఆసుపత్రికి చెందిన ఇద్దరు రోగులకు అమర్చనున్నారు.