తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నౌకను పేల్చేసిన బ్రహ్మోస్‌ క్షిపణి.. 400 కిలోమీటర్లకు పెరిగిన రేంజ్ - BrahMos supersonic cruise successfully tested

శత్రుదేశాలకు సింహ స్వప్నమైన బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణిని భారత్‌ మరింత ఆధునీకరించింది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం నాశనం చేసేలా దాన్ని అభివృద్ధి చేసింది. సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్‌ తన అమ్ములపొదిలో మరో అత్యంత కీలకమైన అస్త్రాన్ని చేర్చుకుంది. అత్యాధునిక బ్రహ్మోస్‌ క్షిపణి ద్వారా భారత సైన్యం మరింత బలోపేతం కానుందని రక్షణ శాఖ ప్రకటించింది.

BrahMos supersonic cruise successfully tested
బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌

By

Published : Dec 29, 2022, 8:44 PM IST

Updated : Dec 29, 2022, 9:38 PM IST

భారత అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రంగా పిలుస్తున్న బ్రహ్మోస్‌ క్షిపణిని మరింత ఆధునీకరించారు. ఒకప్పుడు 290 కిలోమీటర్ల దూరానికే పరిమితమైన బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ మిసైల్‌ను తాజాగా 400 కిలోమీటర్ల రేంజ్‌కు పెంచారు. గురువారం బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌ను పరీక్షించగా అది విజయవంతమైనట్లు కేంద్ర రక్షణశాఖ ప్రకటించింది.

బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌ పరీక్షించిన అనంతరం రక్షణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు పేర్కొంది. ఈ యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి నిర్దేశిత దూరంలోని నౌకను పేల్చేసినట్లు రక్షణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని నేరుగా తాకిందని పేర్కొంది. దీంతో అధునాతన బ్రహ్మోస్‌ క్షిపణి పరిధి 400 కిలోమీటర్లకు పెరిగింది. ఈ ఏడాది మేలోనూ సుఖోయ్ యుద్ధ విమానం నుంచి పరిధి విస్తరించిన సూపర్‌సోనిక్ క్షిపణిని వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి పరిధి 290కిలోమీటర్ల నుంచి 350కు పెరిగినట్లు అప్పట్లో వాయుసేన ప్రకటించింది. తాజాగా బ్రహ్మోస్‌ పరిధిని మరింతగా పెంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేశారు.

బ్రహ్మోస్‌ ఎక్స్​టెండెడ్‌ రేంజ్‌ సామర్థ్యం, సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం సమర్థమైన పనితీరు భారత వైమానిక దళానికి ఒక వ్యూహాత్మక బలాన్ని అందించనున్నాయని రక్షణశాఖ తెలిపింది. భవిష్యత్తు యుద్ధాలలో భారత్‌ ఆధిపత్యం చలాయించడానికి ఇవి దోహదపడతాయని అభిప్రాయపడింది. బ్రహ్మోస్‌ ప్రయోగానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను భారత వాయుసేన ట్విటర్‌లో పంచుకుంది.

Last Updated : Dec 29, 2022, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details