Boyfriend Kills Girlfriend Delhi : 16 ఏళ్ల బాలికను ఆమె బాయ్‌ఫ్రెండ్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. రోడ్డుపైనే ఆమెను కత్తితో అనేకసార్లు పొడిచి, బండరాయితో కొట్టి చంపాడు. దిల్లీ షాబాద్ ప్రాంతంలో ఆదివారం జరిగిందీ ఘోరం.
పోలీసులు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన బాలిక.. షాబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీ వాసి. 20 ఏళ్ల సాహిల్, ఆమె కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే శనివారం వీరిద్దరికీ ఏదో విషయంలో గొడవ జరిగింది. ఆదివారం ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సాహిల్ అడ్డగించాడు. బాలికను కత్తితో అనేకసార్లు పొడిచాడు. దగ్గర్లో ఉన్న బండరాయితో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Delhi Girl Murdered By Boyfriend : నడి వీధిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు. బాలికను సాహిల్ ఎన్నిసార్లు కత్తితో పొడిచాడో పోస్ట్‌మార్టం పరీక్ష నివేదిక వచ్చాక తెలుస్తుందని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడు సాహిల్ కోసం ఆరుబృందాలుగా ఏర్పడి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
"షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాయితో దాడి చేసి చంపాడు. నిందితుడిని 20 ఏళ్ల సాహిల్‌గా గుర్తించాం. ఆదివారం.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మృతురాలు తన స్నేహితురాలి కుమారుడి పుట్టినరోజు వేడుకకు వెళ్తుండగా నిందితుడు ఆమెను అడ్డగించి హత్య చేశాడు" అని పోలీసులు తెలిపారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే!
16 ఏళ్ల బాలిక దారుణ హత్య ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. సాహిల్‌ను ఎప్పుడూ చూడలేదని మృతురాలి తల్లి చెప్పింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. "నా కుమార్తెను అనేక సార్లు కత్తితో పొడిచారు. ఆమె తలను కూడా ముక్కలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము" అని బాధితురాలి తండ్రి వ్యాఖ్యానించారు.