తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. యువతి నిద్రిస్తున్న సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఝార్ఖండ్.. దుమ్కా జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దుమ్కా జిల్లా బాల్కీ గ్రామానికి చెందిన ఓ యువతికి మహేశ్‌పుర్‌కు చెందిన రాజేశ్ అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటుండగా.. 2022లో రాజేశ్‌కు మరొకరితో వివాహం జరిగింది. దీంతో యువతి తల్లిదండ్రులు సైతం ఆమెను మరొకరి ఇచ్చి పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ రాజేశ్ మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని యువతి వెంటపడ్డాడు. యువతి ఎంత చెప్పినా వినకపోగా.. ఆమెను చంపుతానని బెదిరించాడు.
శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయం చూసుకుని రాజేశ్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు బద్దలకొట్టుకుని వెళ్లి అప్పటికే పడుకుని ఉన్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
స్నేహితుల మాటలు విని..
పెద్దయ్యాక తనకు హాని కలిగిస్తాడన్న స్నేహితుల చెప్పుడు మాటలు విన్న ఓ వ్యక్తి తన రెండున్నరేళ్ల కొడుకును కొట్టి హతమార్చాడు. ఆ వ్యక్తి బాలుడి తల్లికి రెండో భర్త గమానార్హం. ఇదంతా జరుగుతున్న సమయంలో చిన్నారి తల్లిని గదిలో బంధించిన నిందితుడు హత్య చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని ఇంట్లోని ఇనుప పెట్టెలో దాచాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనియార్లో జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది :పోలీసుల వివరాల ప్రకారం కొత్వాలీకి చెందిన నిందితుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యను 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోగా రెండో భార్యను ఒకటిన్నర నెల క్రితం వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు కూడా ఇదివరకే పెళ్లవ్వగా ఆమె తన మొదటి భర్తను వదిలేసి నిందితుడితో కలిసుంటోంది. వీరందరూ ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు రెండున్నరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నిందితుడు ఆ చిన్నారికి సవతి తండ్రి అవుతాడు.