Boy Was Dead in Culvert at Hyderabad: మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన మిథున్ రెడ్డి(4) అనే బాలుడు మృతి చెందాడు. ప్రగతినగర్ తురక చెరువులో బాలుడి మృతదేహం డీఆర్ఎఫ్ సిబ్బందికి లభ్యమయింది. మధ్యాహ్నం బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, స్థానికులు వెతికారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఆర్ఎఫ్(DRF) బృందాలు బాలుడి కోసం గాలించాయి. బాలుడి ఆచూకీ లభించిన.. తను మాత్రం ప్రాణాలతో లేకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సంతోష్ రెడ్డి దంపతుల కుమారుడు మిథున్ రెడ్డి . ఓ ఫార్మా కంపెనీలో ఆయన పని చేస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్న నాలాలో బాలుడు పడిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు గాలింప సాగారు.
Boy Dead at Medchal :నాలాలో పడే అవకాశం ఏమైనా ఉందా అనే అనుమానంతో చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో బాలుడు నాలాలో పడిపోయిన దృశ్యాలు గుర్తించారు. ఆ కాలువ సాయినగర్- గృహకల్ప వైపు వెళ్లే నాలాలో కలుస్తుంది. దీంతో స్థానికులు ఆ చుట్టు పక్కల ఉన్నవారితో కలిసి గాలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు. అక్కడ సహాయక బృందాలు ఆలస్యంగా రావడంతో.. స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్ఎఫ్ బృందాలు గాలింపులో భాగంగా నాలా కలిసే కిలోమీటరు దూరంలో ఉన్న తురక చెరువు వద్ద గాలింపు చర్యలు ప్రారంభించారు.
సీసీ కెమెరాలో దృశ్యాలు : సీసీ కెమెరాలా ముందు పెద్దాయన నడుస్తుంటే వెనుకనే బాలుడు కూడా నడుస్తున్నాడు. ఆ విషయాన్ని ఆ వ్యక్తి గుర్తించకుండా నాలాను దాటాడు.. వెంటనే ఆ వెనుక ఉన్న మిథున్ నాలాను దాటలేక అందులో పడి రెప్పపాటులో కొట్టుకుపోయాడు. ఆ విషయం ముందున్న వ్యక్తి కనీసం గుర్తించలేదు. లేకపోతే బాలుడు ప్రాణం నిలిచే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.