RAPE CONVICTION : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మైనర్‌కు స్థానిక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మధురా జిల్లాలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఈ తీర్పును వెలువరించింది. అంతేగాకుండా రూ.లక్ష వరకు జరిమానా కట్టాలని తీర్పు చెప్పింది. విచారణ సమయంలో నిందితుడు జైలులో ఉన్న సమయాన్ని కూడా ఇందులో లెక్కకడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అదనపు జిల్లా న్యాయమూర్తి సుభాష్ చంద్ర చతుర్వేది తీర్పు చెప్పారు.
దోషిగా తేలిన సూరజ్.. 2018 ఫిబ్రవరి 5న ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయవాది తెలిపారు. బాలిక తల్లి, అమ్మమ్మ బయటకు వెళ్తూ.. సూరజ్ వాళ్ల ఇంట్లో వదిలి వెళ్లగా ఆ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లి తిరిగి వచ్చిన తర్వాత చిన్నారిని ఇంటికి తీసుకురాగా.. ఆ సమయంలో బాలిక వాంతులు చేసుకున్నట్లు అమ్మమ్మ గుర్తించిందని చెప్పారు.
బాలిక అనారోగ్యంతో బాధపడుతుందని అనుకుని ఆమెకు మందులు అందించినట్లు తెలిపారు. కోలుకున్న అనంతరం సూరజ్ చేసిన విషయాన్ని బాలిక ఇంట్లో వారికి వివరించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సూరజ్ మీద పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.