Boy Saved by Fishermen After 36 Hours Of Drowning : గుజరాత్‌లో 14 ఏళ్ల బాలుడు సినీ ఫక్కీలో ప్రాణాలతో బయటపడ్డాడు. సూరత్‌లోని డుమాస్ బీచ్‌కు సరదాగా వెళ్లిన బాలుడిని అలలు సముద్రంలోకి లాగేశాయి. కడలిలో దొరికిన ఒక చెక్కను ఆసరాగా చేసుకుని దాదాపు 36 గంటలు పిల్లాడు ప్రాణాలు నిలుపుకున్నాడు. ఇక అతడిలో ఆశలు సన్నగిల్లుతున్న దశలో చేపలు పట్టడానికి వచ్చిన జాలర్లు గుర్తించడం వల్ల బతికి బయటపడ్డాడు.
ఇదీ జరిగింది
సూరత్‌కు చెందిన వికాస్ దేవిపూజక్ మరో బాలుడు లక్ష్మణ్‌తో కలిసి మూడు రోజుల క్రితం సూరత్‌లోని డుమాస్ బీచ్‌కు వెళ్లాడు. కొద్దిసేపు తీరంలో ఆటలాడిన వారిద్దరూ అనూహ్యంగా విరుచుకుపడిన అలలు తీవ్రతకు సముద్రంలో గల్లంతయ్యారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలో లక్ష్మణ్ అనే బాలుడిని స్థానికులు రక్షించగా... వికాస్ గల్లంతయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలించాయి. అయినా అతడి జాడ లభించలేదు. వికాస్ గల్లంతై 24 గంటలు గడిచిపోవడం వల్ల అతడి కుటుంబ సభ్యుల్లోనూ ఆశలు సన్నగిల్లాయి. ఇంతలోనే అద్భుతం జరిగింది. గల్లంతైన బాలుడిని కొందరు జాలర్లు ఒడ్డుకు తీసుకొచ్చారు. పిల్లాడిని చూసిన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు.