తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పబ్​జీ ఆడొద్దన్న తల్లిని కాల్చి చంపిన బాలుడు.. లూడోలో నష్టపోయి ఆత్మహత్య - తల్లిని హత్య చేసిన పబ్జీ బాలుడు

Boy murder mother for PUBG: ఆన్​లైన్ గేమ్స్​కు మూడు ప్రాణాలు బలయ్యాయి. పబ్​జీ ఆడుకోనివ్వలేదని ఓ బాలుడు తన తల్లిని కాల్చి చంపాడు. మరోవైపు, లూడో గేమ్​లో డబ్బులు కోల్పోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులో ఓ వ్యక్తి ఫ్రీ ఫైర్ ఆడి లక్ష రూపాయలు పోగొట్టుకొని.. ఉరేసుకొని చనిపోయాడు.

boy-murder-mother-for-pubg-in-lucknow

By

Published : Jun 8, 2022, 9:35 AM IST

Boy murder mother for PUBG: ఆన్​లైన్ గేమ్ ఆడుకోనివ్వలేదని 16 ఏళ్ల బాలుడు తన తల్లిని హత్య చేశాడు. ఉత్తర్​ప్రదేశ్ రాజధాని లఖ్​నవూలో జరిగిందీ ఘటన. మొబైల్​లో గేమ్స్​కు అలవాటు పడిన అతడు.. తల్లిని తుపాకీతో కాల్చేశాడు. అంతేగాక, హత్యను కప్పిపుచ్చడానికి పోలీసులకు కథలు చెప్పాడు. విద్యుదాఘాతం వల్ల తన తల్లి చనిపోయిందంటూ బుకాయించాడు. అయితే, విచారణలో విషయం బయటపడింది.

మృతదేహం

లఖ్​నవూలోని పీజీఐ ప్రాంతంలో మృతురాలు సాధన నివసిస్తోంది. ఈమెకు 16 ఏళ్ల కుమారుడు, పదేళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. సాధన కుమారుడు పబ్​జీ గేమ్​కు బానిసైపోయాడు. ఈ అలవాటు మానుకోవాలని ఎన్నిసార్లు నచ్చజెప్పేందుకు చూసినా బాలుడు వినిపించుకోలేదు. గత శనివారం సాధన నిద్రిస్తున్న సమయంలో ఆమెపై బాలుడు తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్​నర్లను స్ప్రే చేశాడు. తమ అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదని, అందుకే తన తల్లి వారి దగ్గరకు వెళ్లిందని పొరుగువారికి చెప్పి నమ్మించాడు. అయితే, మంగళవారం రాత్రి 8 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి.. ఎవరో అమ్మను ఎవరో చంపేశారని చెప్పాడు. పోలీసులు ఘటనాస్థలికి రాగా.. బాలుడు వారికి కట్టుకథ చెప్పాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మూడు రోజుల నుంచి ఇంటికి వస్తున్నాడని.. అతడే హత్య చేసి ఉంటాడని చెప్పుకొచ్చాడు. మరోవైపు, మృతదేహం పూర్తిగా పురుగులు పట్టిపోయిందని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. శవం చుట్టూ రక్తపు మరకలు ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపగా.. నిజం బయటకు వచ్చింది.

సాధన ఇంట్లో పోలీసులు

ఆ కోపంతోనే
ఇటీవల సాధన ఇంట్లో నుంచి రూ.10వేలు పోయాయి. బాలుడే తీసి ఉంటాడని తల్లి అనుమానించింది. కొడుకును గట్టిగా నిలదీసింది. హత్యకు మూడు రోజుల ముందు బాలుడిని తీవ్రంగా కొట్టింది. అయితే, చివరకు డబ్బులు ఇంట్లోనే కనిపించాయి. దీంతో పాటు గతేడాది అక్టోబర్​లో సాధనకు ఆమె భర్తతో గొడవలు అయ్యాయి. దీనికీ బాలుడే కారణమని తెలిసింది. ఈ ఘటనలతో తల్లీకొడుకు మధ్య అనుబంధం సన్నగిల్లింది. తల్లిపై కోపం పెంచుకున్న బాలుడు.. హత్య చేసేవరకు వెళ్లాడని పోలీసులు తెలిపారు.

మరోవైపు, తమిళనాడులోని కరూర్​లో ఓ యువకుడు ఆన్​లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ధంతోనిమలైకి చెందిన సంజయ్​గా (23) గుర్తించారు. మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. "ఫ్రీఫైర్ గేమ్ ఆడి లక్ష రూపాయలు నష్టపోయాను" అని మృతుడు వాట్సాప్ స్టేటస్ పెట్టాడని పోలీసులు తెలిపారు. అతడి గేమ్ ఐడీని స్నేహితులు హ్యాక్ చేశారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

మృతుడు

మధ్యప్రదేశ్ ఇందోర్​లో ఓ యువకుడు.. లూడో గేమ్​లో లక్షలు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆజాద్ నగర్​ ప్రాంతంలో నివసిస్తున్న అతడు.. ఉరేసుకొని చనిపోయాడు. పోలీసులు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్​లైన్ గేమ్​లో డబ్బులు పోగొట్టుకున్నందునే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్​లో మృతుడు పేర్కొన్నాడు. మృతుడిని బసత్ దేవిదాస్ గవ్లేగా (23) గుర్తించారు. అతడికి ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని తెలిపారు. ఆన్​లైన్ గేమ్స్​లో డబ్బులు పోగొట్టుకున్నాక.. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఓ గదిలో ఉరేసుకున్నాడని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details