కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎంతోమంది తమలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. అదే కోవకు చెందుతాడీ కర్ణాటక విద్యార్థి. పదో తరగతి చదువుతున్న అన్ష్ రావు.. వ్యర్థ పదార్థాలను సేకరించి, సోషల్ మీడియా సాయంతో ఏకంగా ఓ వాహనాన్నే రూపొందించాడు. ఇంజిన్, గేర్లు లేకుండా తయారైన ఈ కారును విద్యుత్ శక్తితో నడిచేలా ఆవిష్కరించాడు.
కారు ప్రత్యేకతలివే..
బెల్గాంలోని జాదవ్ నగర్‌కు చెందిన అన్ష్ రావు.. తన చిన్న నాటి నుంచే సొంతంగా ఓ కారును తయారుచేయాలని అనుకునేవాడు. లాక్డౌన్ సమయంలో తన కలల్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాడు. గూగుల్, యూట్యూబ్‌ల సాయంతో తన సృజనాత్మకతను పదును పెట్టే.. రకరకాల వీడియోలను చూశాడు. ఆ సమాచారానికి తన ప్రతిభా నైపుణ్యాలను జోడించి ఓ ఎలక్ట్రిక్ కారును రూపొందించాడు. 12 వాట్ల బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ వాహనం 4 గంటల ఛార్జింగ్‌తో సుమారు 70కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గేర్లు లేకుండా నడిచే ఈ కారులో రివర్స్ సౌకర్యం కల్పించడం అన్ష్లోని ఆవిష్కరణ కోణాన్ని చాటుతోంది. అంతేకాకుండా సైడ్ మిర్రర్లకు బదులుగా భద్రత కోసం అమర్చిన ఫ్రంట్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.