Boy Killed Youth In Delhi :కేవలం రూ.350 కోసం ఓ గుర్తుతెలియని యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు 16 ఏళ్ల బాలుడు. ఈ దారుణం దేశ రాజధాని దిల్లీలో జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
ఉత్తర దిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో ఒక బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదే దారిలో 18 ఏళ్ల ఓ యువకుడు ఉన్నాడు. ఒంటరిగా వెళ్తున్న యువకుడిని గమనించిన బాలుడు ఒక్కసారిగా అతడిపై దాడికి దిగాడు. ఊపిరాడనివ్వకుండా చేసి ఆ యువకుడిని చంపాలనుకున్నాడు. అనుకున్నట్లుగా చేయడం వల్ల అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో యువకుడిని దాదాపు 50 సార్లు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం అతడి జేబులో ఉన్న రూ.350 డబ్బును తీసుకున్నాడు బాలుడు.
డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం..
మరోవైపు నగదును తీసుకున్న తర్వాత మృతదేహం ముందు కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ పైశాచికానందాన్ని పొందాడు నిందితుడు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల 20 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు పోలీసులు.